Rinku Singh: ఐదు సిక్సర్లు కొట్టిన బ్యాట్ రింకు సింగ్ ది కాదు.. ఎవరిదంటే..?
నిజానికి అతడు ఉపయోగించిన బ్యాట్ అతడిది కాదట. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా ది. వాస్తవానికి ఆ బ్యాట్‌ను రింకు సింగ్‌కు ఇవ్వడం నితీశ్ కు ఇష్టం లేదట.

Rinku Singh
Rinku Singh: రింకు సింగ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. ఒక్క ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచం మొతాన్ని తన వైపుకు తిప్పుకున్న ఆటగాడు ఇతను. దాదాపుగా గెలుపు అసాధ్యం అనుకున్న సమయంలో అతడు ఆడిన ఇన్సింగ్స్‌ను మాటల్లో వర్ణించలేం. 5 బంతుల్లో 28 పరుగులు అవసరం కాగా.. ప్రతీ బంతిని సిక్సర్‌గా మలిచి గుజరాత్ టైటాన్స్ పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు. ప్రస్తుతం ఏ నోట విన్నా రింకు సింగ్(Rinku Singh) గురించే చర్చ.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే రింకు సింగ్ వాడిన బ్యాట్. నిజానికి అతడు ఉపయోగించిన బ్యాట్ అతడిది కాదట. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా ది. వాస్తవానికి ఆ బ్యాట్‌ను రింకు సింగ్‌కు ఇవ్వడం నితీశ్ కు ఇష్టం లేదట. అయితే.. ఎవరో డ్రెస్సింగ్ రూమ్ నుంచి దానిని రింకు సింగ్‌కు ఇచ్చారట. ఇకపై ఆ బ్యాట్‌ను తాను తీసుకోనని నితీశ్ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్(KKR) తమ సోషల్ మీడియా ఫాట్‌ఫాంలో పోస్ట్ చేసింది.
“ఇది (రింకూ ఉపయోగించినది) నా బ్యాట్. నేను ఈ బ్యాట్‌తో రెండు మ్యాచ్‌లు (ఈ సీజన్‌లో) ఆడాను. నేను మొత్తం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని, గత సంవత్సరం చివరి నుంచి నాలుగు నుండి ఐదు మ్యాచ్‌లను ఈ బ్యాట్‌తోనే ఆడాను. ఇది అతడికి ఇవ్వాలని అనుకోలేదు. ఎవరో డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఈ బ్యాట్‌ను తెచ్చి రింకు కు ఇచ్చారు. గుజరాత్ పై అదరగొట్టాడు. కాబట్టి ఇక ఈ బ్యాట్ అతడిదే. ఆ లక్కీ బ్యాట్‌ను అతడి నుంచి నేను వేరు చేయను.” అని నితీశ్ రాణా అన్నాడు.