Rising Stars Asia Cup 2025 India qualify for semis
Rising Stars Asia Cup 2025 : ఆసియాకప్ 2025 రైజింగ్ టోర్నీలో భారత్-ఏ సెమీఫైనల్‌కు దూసుకువెళ్లింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మంగళవారం ఒమన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఒమన్ బ్యాటర్లలో వసీం అలీ (54 నాటౌట్; 45 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. హమ్మద్ మీర్జా (32; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. భారత బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్, సుయాష్ శర్మ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. విజయ్‌కుమార్ వైషాక్, హర్ష్ దూబే, నమన్ ధీర్ లు తలా ఓ వికెట్ సాధించారు.
IND vs SA : భారత్‌తో రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా మాస్టర్ ప్లాన్.. స్టార్ పేసర్‌కు చోటు..
అనంతరం 136 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (12), ప్రియాంష్ ఆర్య (10)లు విఫలం అయ్యారు. హర్ష్ దూబే (53 నాటౌట్; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ బాదాడు. నమన్ ధీర్ (30; 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.
పాక్ పై గత మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి భారత్ త్వరగానే కోలుకుంది. ఒమన్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమ్‌ను సెమీఫైనల్ కు చేర్చిన హర్ష్ దూబే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడిని ఎస్ఆర్‌హెచ్ బేస్ ప్రైజ్ రూ.30లక్షలకే రిటైన్ చేసుకుంది. అతడు ఎస్ఆర్‌హెచ్ తరుపున మూడు మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు తీశాడు.
ఇదిలా ఉంటే.. శుక్రవారం సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉన్న భారత్ గ్రూప్-ఏలో తొలి స్థానంలో ఉన్న జట్టుతో తలపడనుంది. ప్రస్తుతం గ్రూప్-ఏలో అగ్రస్థానంలో బంగ్లాదేశ్ ఉంది. శ్రీలంక-ఏతో జరిగే మ్యాచ్‌లో బంగ్లా గెలిస్తే అప్పడు భారత్‌తో సెమీస్ ఆడనుంది. ఒకవేళ భారీ తేడాతో ఓడితే అప్పుడు భారత్, శ్రీలంక జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ జరగనుంది.