కేఎల్ రాహుల్ స్వార్థపరుడా? లార్డ్స్ సెంచరీపై విమర్శలకు రాబిన్ ఉతప్ప ఘాటు సమాధానం.. అసలు వివాదం ఏంటి?

ఇది రాహుల్ వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకున్న నిర్ణయమనేది వారి ఆరోపణ.

IND vs ENG 3rd Test- KL Rahul and Rishabh Pant

లార్డ్స్ మైదానంలో మరోసారి శతకంతో చెలరేగిన కేఎల్ రాహుల్ తన పేరు మరోసారి మారుమోగిపోయేలా చేసుకున్నాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఓపెనర్‌గా బాధ్యతలు చేపట్టి, ఈ సిరీస్‌లో రెండు సెంచరీలతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయితే, అతని లార్డ్స్ శతకంపై ఒక చిన్న వివాదం రాజుకుంది. ఈ విమర్శలపై టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప స్పందిస్తూ, రాహుల్‌కు అండగా నిలిచాడు.

అసలు వివాదం ఏంటి?
లార్డ్స్ టెస్టులో లంచ్ బ్రేక్‌కు ముందు తన శతకాన్ని పూర్తి చేయాలనే ఆతృతలో రాహుల్ వేగంగా ఆడటం వల్లే, మరో ఎండ్‌లో ఉన్న రిషబ్‌ పంత్ ఒత్తిడికి గురై వికెట్ కోల్పోయాడని కొందరు విమర్శిస్తున్నారు. ఇది రాహుల్ వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకున్న నిర్ణయమనేది వారి ఆరోపణ.

విమర్శలకు ఉతప్ప కౌంటర్
ఈ విమర్శలను రాబిన్ ఉతప్ప తన యూట్యూబ్ ఛానెల్‌లో తీవ్రంగా ఖండించాడు. ఆటగాళ్ల నిర్ణయాల వెనుక ఉన్న వ్యూహాన్ని అర్థం చేసుకోవాలని సూచించాడు.

Also Read: ఫ్యాన్స్‌ హృదయాలను గెలుచుకున్న జడేజా బ్యాటింగ్‌లో హీరో… బౌలింగ్‌లో జీరోనా? మోయిన్ అలీ కామెంట్స్ వెనుక..

“లంచ్‌కి ముందు సెంచరీ పూర్తి చేయడం అతనికి ఎందుకు అంత ముఖ్యమో ఎవరైనా ఆలోచించారా? దానికి కచ్చితంగా ఒక కారణం ఉంటుంది. మనం ఊహాగానాలతో విమర్శించే బదులు, ఆటగాడి ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాలి” అని ఉతప్ప స్పష్టం చేశాడు.

ఉతప్ప అభిప్రాయం ప్రకారం.. అది వ్యక్తిగత రికార్డు కోసం తీసుకున్న నిర్ణయం కాదు, మ్యాచ్‌ను శాసించాలనే వ్యూహంలో భాగం. రాహుల్-పంత్ మధ్య జరిగిన సంభాషణ బహుశా ఇలా ఉండి ఉంటుందని ఆయన విశ్లేషించాడు..

“రాహుల్ పంత్‌తో ఇలా అని ఉండొచ్చు: ‘మనం ఇద్దరం బాగా సెట్ అయ్యాం. నేను లంచ్‌కు ముందే 100 పూర్తిచేస్తే, ఆత్మవిశ్వాసంతో బ్రేక్‌కు వెళ్లొచ్చు. లంచ్ తర్వాత వచ్చి, మరింత దూకుడుగా ఆడి ఇంగ్లాండ్‌ను పూర్తిగా మ్యాచ్ నుండి బయటకు నెట్టేద్దాం’,” అని ఉతప్ప వివరించాడు.

ఇది వ్యక్తిగత మైలురాయిని (సెంచరీని) దాటి, జట్టును గెలుపు దిశగా నడిపించాలనే ప్రణాళిక అని ఆయన అన్నారు. ఓపెనర్‌గా జట్టుకు స్థిరత్వాన్ని అందిస్తున్న కేఎల్ రాహుల్‌పై వస్తున్న విమర్శలు అర్థరహితమని రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్ల నిర్ణయాల వెనుక ఉన్న వ్యూహాత్మక కారణాలను చూడకుండా, కేవలం పైపైన చూసి విమర్శించడం సరైన పద్ధతి కాదని ఆయన గట్టిగా చెప్పారు.