ఫ్యాన్స్‌ హృదయాలను గెలుచుకున్న జడేజా బ్యాటింగ్‌లో హీరో… బౌలింగ్‌లో జీరోనా? మోయిన్ అలీ కామెంట్స్ వెనుక..

జడేజా బ్యాటింగ్‌కు ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో, అతని బౌలింగ్‌పై అన్ని విమర్శలు వస్తున్నాయి.

ఫ్యాన్స్‌ హృదయాలను గెలుచుకున్న జడేజా బ్యాటింగ్‌లో హీరో… బౌలింగ్‌లో జీరోనా? మోయిన్ అలీ కామెంట్స్ వెనుక..

Ravindra Jadeja

Updated On : July 18, 2025 / 12:15 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది, కానీ రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం మాత్రం క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఓటమి అంచున నిలిచిన జట్టును గెలిపించడానికి అతను చేసిన ప్రయత్నం అద్భుతం. అయితే, జడేజా బ్యాటింగ్‌కు ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో, అతని బౌలింగ్‌పై అన్ని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

ఒకవైపు ప్రశంసలు… మరోవైపు విమర్శలు
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. ఆ సమయంలో జడేజా క్రీజులో పాతుకుపోయి, 181 బంతుల్లో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి బ్యాటర్లు బుమ్రా, సిరాజ్‌లతో కలిసి ఆడుతూ కూడా భారత గెలుపు ఆశలను చివరి వరకు సజీవంగా ఉంచాడు.

ఈ సిరీస్‌లో వరుసగా నాలుగు అర్ధశతకాలు సాధించాడు. ఇంగ్లాండ్‌లో ఈ ఘనత సాధించిన గంగూలీ, రిషబ్ పంత్ సరసన చేరాడు. జడేజా ఆటతీరుపై మోయిన్ అలీ స్పందదిస్తూ.. “అతని బ్యాటింగ్ శిఖర స్థాయికి చేరింది” అని  ప్రశంసించాడు.

“అతను ఏం చేస్తున్నాడో అతనికి బాగా తెలుసు. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడు. కానీ, బౌలింగ్‌లో మాత్రం అతనికి వికెట్లు దొరకడం లేదు. అతను చాలా కఠినంగా బౌలింగ్ చేయగలడు, కానీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాడు” అని మోయిన్ అలీ అన్నాడు.

“నేను కుల్దీప్‌ను జట్టులో చూడాలనుకుంటున్నాను. కానీ ఎవరి స్థానంలో అతన్ని తీసుకోవాలనేది కష్టమైన నిర్ణయం. వాషింగ్టన్ సుందర్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, జడేజా బ్యాటింగ్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. అయినా, కుల్దీప్‌కు ఒక అవకాశం ఇవ్వాలి” అని మోయిన్ అభిప్రాయపడ్డాడు.

అసలు సమస్య ఎక్కడ?
జడేజా బ్యాటింగ్‌లో అదరగొడుతున్నా, జట్టులో అతని ప్రధాన పాత్ర ఫ్రంట్‌లైన్ స్పిన్నర్. కానీ, ఈ సిరీస్‌లో అతని బౌలింగ్ గణాంకాలు నిరాశపరుస్తున్నాయి. ఈ సిరీస్‌లో ఆడిన మూడు టెస్టుల్లో జడేజా తీసింది కేవలం మూడు వికెట్లు మాత్రమే. ఇది అతని స్థాయికి చాలా తక్కువ.

జడేజా బౌలింగ్‌లో తేలిపోతుండటంతో, స్పిన్ విభాగంలో మార్పులు చేయాలనే వాదన వినపడుతోంది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు టెస్టులుగా బెంచ్‌కే పరిమితమయ్యాడు.

రవీంద్ర జడేజా తన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంటున్నప్పటికీ, ఒక స్పిన్నర్‌గా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నాడనేది వాస్తవం. రాబోయే టెస్టుల్లోనైనా అతను బంతితో మ్యాజిక్ చేస్తాడా? లేక అతని స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కుతుందా? అనేది వేచి చూడాలి.