విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్టు ఆడుతోంది. టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఓపెనర్లలో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ రెచ్చిపోయారు. తొలి రోజు ఆటలో పరుగుల వరద పారించారు. టెస్టు మ్యాచ్ లో తొలిసారి ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మయాంక్ తో కలిసి భారీ స్కోరు రాబట్టాడు. తొలి రోజు ఆటలో సెంచరీ పూర్తి చేసిన రోహిత్ రెండో రోజు కూడా అదే దూకుడును కొనసాగిస్తూ (244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) 176 పరుగులతో సెంచరీ పూర్తి చేశాడు.
ఒక దశలో రోహిత్ దూకుడుకు దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ కళ్లెం వేశాడు. 82 ఓవర్ లో మహారాజ్ వేసిన బంతిని షాట్ ఆడేందుకు ముందుకు వచ్చిన రోహిత్ స్టంప్ ఔట్ అయ్యాడు. మయాంక్ తో కలిసి రోహిత్ విజృంభించడంతో భారత్ స్కోరు 317 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. రోహిత్ ఔట్ అయిన అనంతరం పెవిలియన్ చేరుకున్నాడు.
అదే సమయంలో డ్రెస్సింగ్ రూంలో నుంచి కోహ్లీ సహా టీమ్ మొత్తం చప్పట్లు కొడుతూ అతడికి వెల్ కమ్ చెప్పారు. రోహిత్.. అద్భుతంగా ఆడావు అంటూ ప్రశంసించారు. కెప్టెన్ కోహ్లీ మాత్రం.. డ్రెస్సింగ్ రూంలోకి వస్తున్న రోహిత్ ను వెన్ను తట్టి శెభాష్ అంటూ అభినందించాడు. కోహ్లీ ప్రదర్శించిన క్రీడాస్పూర్తిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్ నైట్ స్కోరు (202/0)తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ 7 వికెట్ల నష్టానికి 502 పరుగులు దగ్గర డిక్లేర్ చేసింది. టెస్టుల్లో తొలి సెంచరీతో చెలరేగిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు.