Rohit Sharma
India vs Australia Test Series Rohit Sharma: ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ సిరీస్ జరగనుండగా తొలి టెస్ట్ పెర్త్ లో జరుగుతుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు వెళ్లారు. అయితే, ఆస్ట్రేలియా వెళ్లిన జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ లేరు. రోహిత్ తొలి టెస్టుకు గైర్హాజరవుతున్నాడని తెలుస్తోంది. ఈ విషయంపై టీమిండియా ప్రధాన కోచ్ గంభీర్ సైతం క్లారిటీ ఇచ్చారు. ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేముందు గంభీర్ మీడియాతో మాట్లాడారు. రోహిత్ శర్మ గైర్హాజరీ అయితే అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా సారధ్య బాధ్యతలు చేపడతారని చెప్పారు.
Also Read: AUS vs IND : గంభీర్ వ్యాఖ్యలపై స్పందించిన రికీ పాంటింగ్.. కోహ్లీ గురించి ఏమన్నాడంటే?
రోహిత్ శర్మ మూడో వారంలో జట్టుతో కలుస్తాడని, దీంతో తొలి టెస్టుకు మాత్రమే దూరం అవుతాడని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. గంభీర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. రోహిత్ గురించి ఎలాంటి సమాచారం లేదని, అతను అందుబాటులోకి వచ్చేవరకు కెప్టెన్ గా బుమ్రా బాధ్యతలు తీసుకుంటాడని చెప్పారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. రెండో టెస్టుకుకూడా రోహిత్ శర్మ దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ లో ప్రారంభం అవుతుంది. ఆ మ్యాచ్ కూ రోహిత్ హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువ అని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.
రోహిత్ శర్మ మరోసారి తండ్రి కాబోతున్నాడు. వచ్చేవారం అతని సతీమణి రితిక రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా అతను తన కుటుంబానికి సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ మేరకు బీసీసీఐకి ఇప్పటికే రోహిత్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తొలి టెస్టు కు తాను హాజరుకాలేనని చెప్పినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం రెండో టెస్టు ప్రారంభ సమయానికి కూడా రోహిత్ ఆస్ట్రేలియాకు చేరుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందేనని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత్ చేరుకోవాలంటూ ఆస్ట్రేలియాతో సిరీస్ ఎంతో కీలకం. ఈ సిరీస్ లో ఐదు మ్యాచ్ లకు నాలుగు మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ జట్టుకు దూరమవుతుండటం ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది.