Salman Ali Agha Breaks Rahul Dravid World Record
Salman Ali Agha : పాకిస్తాన్ టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అరుదైన ఘనత సాధించాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్ ఆడడం ద్వారా అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ను అధిగమించాడు.
1999 సంవత్సరంలో రాహుల్ ద్రవిడ్ టీమ్ఇండియా తరుపున 53 అంతర్జాతీయ మ్యాచ్‌లు (43 వన్డేలు, 10 టెస్టులు) ఆడాడు. సల్మాన్ అలీ అఘా 2025లో పాక్ తరుపున 54 అంతర్జాతీయ మ్యాచ్‌లు (17 వన్డేలు, 32 టీ20లు, 5 టెస్టులు)లు ఆడాడు. ఇక ఈ జాబితాలో వీరిద్దరి తరువాత మహమ్మద్ యూసుఫ్, ఎంఎస్ ధోని వంటి ఆటగాళ్లు ఉన్నారు.
ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు వీరే..
* సల్మాన్ అలీ అఘా (పాకిస్తాన్) – 54 మ్యాచ్‌లు (2025లో)
* రాహుల్ ద్రవిడ్ (భారత్) – 53 మ్యాచ్‌లు (1999లో)
* మహమ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్) – 53 మ్యాచ్‌లు (2000లో)
* ఎంఎస్ ధోని (భారత్) – 53 మ్యాచ్‌లు (2007లో)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది. పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజామ్ (74; 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్జాదా ఫర్హాన్(63; 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలు చేశారు. ఫఖర్ జమాన్ (27 నాటౌట్; 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు ) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రజా రెండు వికెట్లు తీశాడు. బ్రాడ్ ఎవాన్స్, రిచర్డ్ నగరవ చెరో వికెట్ సాధించాడు.
Rishabh Pant : రిషబ్ పంత్‌కు వన్డే కెప్టెన్సీ ఇవ్వకపోవడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?
ఆ తరువాత 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 19 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్ (67 నాటౌట్; 49 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ సికిందర్ రజా (23) పర్వాలేదనిపించాడు. వీరిద్దరు మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్ నాలుగు వికెట్లు తీశాడు. మహ్మద్ నవాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. నసీమ్ షా, మహ్మద్ వసీం జూనియర్, ఫహీమ్ అష్రఫ్ తలా ఓ వికెట్ పడగొట్టాడు.