Same mistakes not good as a team says Najmul Hossain Shanto after 2nd T20 against india
IND vs BAN 2nd T20 : పాకిస్థాన్ గడ్డపై పాకిస్థాన్‌ను ఓడించి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుని భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్‌కు ఏదీ కలిసిరావడం లేదు. వరుస ఓటములు పలకరిస్తున్నాయి. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో 0-2 తేడాతో ఓడిపోయిన బంగ్లా తాజాగా మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కోల్పోయింది. ఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20 మ్యాచులో 86 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించింది. పరుగుల పరంగా బంగ్లాపై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం కావడం గమనార్హం.
రెండో టీ20 మ్యాచ్‌లో ఓటమి అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో మీడియాతో మాట్లాడాడు. తమ ఓటమికి గల కారణాలు వివరించాడు. మొదటి టీ20లో చేసిన తప్పులనే పునరావృతం చేయడంతోనే ఓటమి పాలైయ్యామని అన్నాడు. ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదన్నాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. మొదటి ఆరు ఓవర్లలో తమ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారన్నాడు.
అయితే.. ఆ తరువాత భారత మిడిల్ ఆర్డర్ రాణించిందన్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడంతో భారత జట్టు భారీ స్కోరు చేసిందని వివరించాడు. తమ ప్రణాళికలను మైదానంలో సరిగ్గా అమలు చేయలేకపోయినట్లు చెప్పాడు. బ్యాటర్లు మరింత బాధ్యత తీసుకుని ఆడాల్సి ఉందన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో నితీశ్ కుమార్ రెడ్డి (74; 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్(53; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్థశతకాలు సాధించారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సేన్ మూడు వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్, ముస్తాఫిజుర్ తలా రెండు వికెట్లు సాధించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులకే పరిమితమైంది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా (39 బంతుల్లో 41) మినహా మిగిలిన వారు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీశ్ రెడ్డి లు చెరో రెండు వికెట్లు తీశారు. అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ లు తలా ఓ వికెట్ సాధించారు.