Sanju Samson Makes Feelings Clear On Batting Order Demotion In Asia Cup 2025
Sanju Samson : ఓపెనింగ్ రావడంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సంజూ శాంసన్ దశ తిరిగింది. పరుగుల వరద పారించి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఏడాది పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు శుభ్‌మన్ గిల్ రీ ఎంట్రీ ఇవ్వడంతో తన స్థానాన్ని కోల్పోయాడు. ఆసియాకప్ 2025లో సంజూ శాంసన్ (Sanju Samson) మిడిల్ ఆర్డర్‌లో ఆడాడు. అక్కడ కూడా తనదైన శైలిలో రాణించి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు.
కాగా.. తన బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చడం పై సంజూ శాంసన్ స్పందించాడు. భారత జట్టు జెర్సీ ధరించడమే తనకు ముఖ్యం అన్నాడు. జాతీయ జట్టులో చోటు దక్కించునేందుకు ఎంతో కష్టపడినట్లుగా చెప్పుకొచ్చాడు. దేశం కోసం ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా తాను సిద్ధం అని తెలిపాడు. అవసరం అనుకుంటే బౌలింగ్ చేయడానికి కూడా రెడీ అని సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2025లో సంజూ శాంసన్ అన్నాడు.
తనను తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయమన్నా చేస్తానని, ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్ చేయమన్నా చేస్తానన్నాడు. దేశం కోసం ఏ చేయడానికైనా తనకు అభ్యంతరం లేదన్నాడు.
ఇక తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘నేను అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తి అయింది. అయినప్పటికి ఇన్నేళ్లలో నేను 40 మ్యాచ్‌లే ఆడాను. గణాంకాలు పూర్తి కథను చెప్పలేవని నేను నమ్ముతాను. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. నన్ను నేను చూసుకుని గర్వపడుతున్నాను. బయటి నుంచి వచ్చే విమర్శల కన్నా నా అంతరాత్మపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకున్నాను.’ అని సంజూ శాంసన్ తెలిపాడు.
ఆసియా కప్ 2025లో కీలక సమయాల్లో సంజూ శాంసన్ రాణించాడు. శ్రీలంకతో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో 39 పరుగులు, పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో 24 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.