Cummins – Head : హెడ్, కమిన్స్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ బంపర్ ఆఫర్..! అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. చెరో రూ.58 కోట్లు..
ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌లకు (Cummins - Head ) భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట.

Pat Cummins Travis Head offered Rs 58 crore per year each by IPL team
Cummins – Head : టీ20ల రాకతో క్రికెట్ స్వరూపమే మారిపోయింది. పొట్టి ఫార్మాట్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. జాతీయ జట్టకు ప్రాతినిధ్యం వహిస్తే వచ్చే నగదుతో పోలిస్తే ఫ్రాంఛైజీ క్రికెట్‌లోనే ఆటగాళ్లు చాలా ఎక్కువ మొత్తాలనే అందుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసి ఏడాది పొడువునా టీ20 లీగులు ఆడుతూ భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారు. నికోలస్ పూరన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి ఆటగాళ్లు ఈ కోవకే చెందుతారు. దీనిపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌లకు (Cummins – Head ) భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. సంవత్సరానికి ఒక్కొక్కరికి 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 58 కోట్లు) ఆఫర్ చేసినట్లు సదరు వార్తల సారాంశం.
Asia Cup 2025 : ఆసియాకప్ ట్రోఫీని తీసుకెళ్లిన నఖ్వీ.. అది అర్ష్‌దీప్ సింగ్ ఐడియానే..
ఈ మొత్తాన్ని పొందాలంటే ఆ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది. వారిద్దరు ఐపీఎల్‌లో మాత్రమే కాకుండా తమ ఫ్రాంఛైజీకి చెందిన జట్ల తరుపున ఇతర లీగుల్లోనూ ఆడాల్సి ఉంటుందట. అయితే.. దీనిపై ప్రస్తుతానికి కమిన్స్, హెడ్‌లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
ఎంత సంపాదిస్తున్నారంటే.. ?
కమిన్స్ క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో అతడికి కాంట్రాక్ట్ రూపంలో ఏడాదికి రూ.8.74 కోట్లు అందుతాయి. ఇక మ్యాచ్ ఫీజులు, ఇతర అన్ని కలుపుకుని మొత్తంగా క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఏడాదికి దాదాపుగా రూ.17.50 కోట్లు సంపాదిస్తాడు. ఐపీఎల్‌లో అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. దీన్ని కూడా కలుపుకుంటే మొత్తంగా కమిన్స్ ఏడాదికి 35 నుంచి 40 కోట్లు సంపాదిస్తున్నాడు.
ట్రావిస్ హెడ్‌ను తీసుకుంటే.. సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా అతడికి రూ.8.70 కోట్లు అందుతాయి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ అతడిని రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంది. మొత్తం అన్ని కలిపి హెడ్ ఏడాదికి రూ.25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు అందుకుంటాడు.
ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఇస్తామన్న రూ.58 కోట్ల ఆఫర్ కమిన్స్ కంటే హెడ్‌కే ఎక్కువ బెన్‌ఫిట్ అవుతుందని అంటున్నారు.