Sanju Samson out of ICC T20 World Cup 2026 plans Kris Srikkanth
Kris Srikkanth : టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఆసియాకప్ 2025 ఎంపిక చేసినప్పుడు ఎంతో మంది ఆనందపడ్డారు. అయితే.. గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడంతో సంజూకు తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా ? అన్న అనుమానాలు మొదలు అయ్యాయి. అయితే.. ఆసియాకప్ 2025లో యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌తో ఆ అనుమానాలు అన్ని తొలగిపోయాయి. తుది జట్టులో సంజూకు చోటు దక్కింది.
కానీ అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగలేదు. అలాగని వన్‌డౌన్‌లోనూ ఆడించలేదు. దీంతో అతడిని వచ్చే మ్యాచ్‌ల్లో పక్కన బెడతారా? అసలు మేనేజ్‌మెంట్ ఆలోచన ఏంది అనే విషయం పై ప్రస్తుతం ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనిపై టీమ్ఇండియా మాజీ ఆటగాడు, కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) స్పందించాడు.
Asia Cup 2025 : ప్రారంభమై మూడు రోజులు కాలేదు.. అప్పుడే ఓ జట్టు టోర్నీ నుంచి ఔట్..
సంజూ శాంసన్‌ను మిడిల్ ఆర్డర్‌కు పరిమితం చేయడం శ్రేయస్ అయ్యర్‌కు దారి చూపేందుకేనని చెప్పాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సంజూ శాంసన్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోందన్నాడు. అయితే.. మిడిల్ ఆర్డర్‌లో అతడు ఎక్కువగా పరుగులు చేయలేదు. ఐదో స్థానంలో అతడు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నాడు. ఇది అతడి ఆత్మవిశ్వాసం పై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపాడు.
టీ20 ఫార్మాట్‌లో శాంసన్ 861 పరుగులు చేయగా.. ఇందులో 522 పరుగులు టీమ్ఇండియా ఓపెనర్‌గానే చేశాడని చెప్పాడు. అతడు చేసిన మూడు సెంచరీలు కూడా ఓపెనర్‌గా చేసినవేనని చెప్పుకొచ్చాడు.
ఒకవేళ ఆసియాకప్‌లో సంజూ శాంసన్ రెండు మ్యాచ్‌ల్లో విఫలమైతే మాత్రం శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. మిడిల్ ఆర్డర్‌లో సంజూ ఫినిషర్ రోల్ పోషించాల్సిన అవసరం లేదన్నాడు. అతడు ఇన్నింగ్స్‌ను దూకుడుగా ముందుకు తీసుకువెళితే చాలు అని అన్నాడు. ఫినిషర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె ఉండనే ఉన్నారన్నాడు.