Asia Cup 2025 : ప్రారంభమై మూడు రోజులు కాలేదు.. అప్పుడే ఓ జట్టు టోర్నీ నుంచి ఔట్..
సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్ 2025 (Asia Cup 2025 ) ప్రారంభమైంది. ఈ మెగాటోర్నీ ప్రారంభమై మూడు రోజులు పూర్తి కాలేదు. అప్పుడే ఓ జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

Asia Cup 2025 Hong Kong team out of the Tournament
Asia Cup 2025 : ఆసియాకప్ 2025 టోర్నీ సెప్టెంబర్ 9 ప్రారంభమైంది. ఈ టోర్నీకి యూఏఈ ఆతిథ్యం ఇస్తున్నాయి. 8 జట్లు కప్పు కోసం పోటీపడుతున్నాయి. అయితే.. ఈ టోర్నీ(Asia Cup 2025) మొదలై మూడు రోజులు కూడా పూర్తి కాలేదు గానీ అప్పుడే ఓ జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమించింది. అది మరే జట్టు కాదు.. పసికూన హాంగ్‌కాంగ్. ఈ టోర్నీలో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన హాంగ్‌కాంగ్ రెండింటిలోనూ ఓడిపోయింది.
అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో కలిసి హాంగ్‌కాంగ్ గ్రూప్ బిలో ఉంది. తొలుత అఫ్గానిస్తాన్ పై ఓడిపోయిన హాంగ్ కాంగ్ గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హాంగ్‌కాంగ్ బ్యాటర్లలో నిజాకత్ ఖాన్ (42), జీషన్ అలీ (30) లు రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, రిషాద్ హొస్సేన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఆ తరువాత 144 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో లిటన్ దాస్ (59; 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకం బాదాడు. తౌహిద్ హృదయ్ (35 నాటౌట్) రాణించాడు. హాంగ్‌కాంగ్ బౌలర్లలో అతీఖ్ ఇక్బాల్ రెండు వికెట్లు తీశాడు.
IND vs PAK : ఇండియాతో మ్యాచ్‌కి ముందు పాక్ కోచ్ హాట్ కామెంట్స్.. మా గేమ్ ఛేంజర్లు..
టోర్నీ నుంచి హాంగ్‌కాంగ్ ఔట్..
వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో హాంగ్‌కాంగ్ జట్టు ఆసియాకప్ 2025 నుంచి దాదాపుగా నిష్ర్కమించినట్లే. కేవలం సాంకేతికంగా మాత్రమే ఇంకా ఆ జట్టు రేసులో ఉంది. హాంగ్‌కాంగ్ పై గెలిచిన అఫ్గాన్, బంగ్లాదేశ్ జట్లు చెరో రెండు పాయింట్లతో గ్రూప్‌లో ప్రస్తుతం మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు శ్రీలంక జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
అఫ్గాన్, బంగ్లాదేశ్‌లు చెరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అటు శ్రీలంక మూడు మ్యాచ్‌లు ఆడనుంది. గ్రూప్ నుంచి రెండు జట్లు మాత్రమే సూపర్ ఫోర్‌కి చేరుకుంటాయన్న సంగతి తెలిసిందే.