IND vs PAK : ఇండియాతో మ్యాచ్‌కి ముందు పాక్ కోచ్ హాట్ కామెంట్స్.. మా గేమ్ ఛేంజర్లు..
ఆసియాకప్ 2025లో భాగంగా భారత్, పాక్ (IND vs PAK) జట్ల మధ్య దుబాయ్ వేదికగా ఆదివారం మ్యాచ్ జరగనుంది.

Mike Hesson fires warning to India ahead of Asia Cup clash
IND vs PAK : ఆసియాకప్ 2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14న (ఆదివారం) మ్యాచ్ జరగనుంది. రెండు దేశాల అభిమానులే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక భారత్ ఇప్పటికే ఆసియా కప్‌లో తన తొలి మ్యాచ్‌లో యూఏఈని చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు పాకిస్తాన్ నేడు (సెప్టెంబర్ 12న) ఒమన్‌తో తలపడనుంది.
ఒమన్‌తో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడికి భారత్, పాక్ మ్యాచ్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఆ మ్యాచ్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ప్రపంచ ఛాంపియన్లలను ఎదుర్కొనేందుకు తన జట్టు సిద్ధంగా ఉందన్నాడు.
‘ప్రస్తుతం టీమ్ఇండియా చాలా ఆత్మవిశ్వాసంతో ఉందని మనందరికి తెలుసు. వారు చాలా బాగా ఆడుతున్నారు. ఇక మేము ఓ జట్టుగా రోజు రోజుకు మెరుగుపడటంపై దృష్టి పెట్టాము. మేము భారత్‌తో మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాము. సవాల్‌ను ఎదర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము.’ అని మైక్ హెస్సన్ అన్నాడు.
పాక్ బౌలింగ్ దాడిపై నమ్మకం హెస్సన్ వ్యక్తం చేశాడు. స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ మహ్మద్ నవాజ్ భారత్‌తో మ్యాచ్‌లో కీలక పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నాడు. గత సంవత్సరం పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ ఎడమచేతి వాటం బౌలర్ అద్భుతంగా పునరాగమనం చేశాడు. ఇటీవల జరిగిన ట్రై-సిరీస్ ఫైనల్‌లో అఫ్గానిస్థాన్ పై హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు ఐదు వికెట్లు తీశాడు.
‘మాకు ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్ బౌలర్ అయిన నవాజ్ ఉన్నాడు. అతను రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. అబ్రార్ అహ్మద్, సుఫియాన్ లు గొప్పగా బంతులు వేస్తున్నారు. ఇక సైమ్ అయూబ్ ఇప్పుడు ప్రపంచంలోని టాప్ టెన్ ఆల్ రౌండర్లలో ఒకడిగా ఉన్నాడు. ఇక సల్మాన్ అలీ అఘా కూడా ఉండనే ఉన్నాడు.’ అని హెస్సన్ తెలిపాడు.
భారత్, పాక్ (IND vs PAK) జట్ల మధ్య దుబాయ్ వేదికగానే మ్యాచ్ జరగనుంది. ఇదే వేదికపై భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో యూఏఈని 93 పరుగుల తేడాతో ఓడించింది. ఈ వేదికలోనే ఒమన్‌తో నేడు పాక్ తలపడనుంది. దీంతో ఇరు జట్లకు కూడా ఈ వేదికలో పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.