ఆల్ రౌండర్ షకీబ్‌పై రెండేళ్ల నిషేధం

  • Publish Date - October 29, 2019 / 01:34 PM IST

బంగ్లాదేశ్‌ టెస్టు, టీ20 కెప్టెన్ షకిబ్‌ అల్‌ హసన్‌పై ఐసీసీ వేటు వేసింది. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఇటీవల తమ డిమాండ్లను తీర్చాలంటూ స్టైక్‌కు దిగిన బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు నేతృత్వం వహించడంతో ఆల్‌ రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ చిక్కుకున్నాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం షకిబ్‌ అల్‌ హసన్‌ను ఒక బుకీ సంప్రదించినా దానిని తేలిగ్గా తీసుకున్నాడు. కనీసం ఎవ్వరికీ చెప్పకుండా దానిని పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో షకీబ్‌పై వేటు పడింది.

ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నమోదు చేసిన అభియోగాలను షకిబ్‌ అంగీకరించడంతో ఏడాది సస్పెన్షన్‌ తర్వాత క్రికెట్‌ ఆడొచ్చని ఐసీసీ వెల్లడించింది. 2018 జనవరిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా షకిబ్‌ను బుకీలు సంప్రదించగా ఈ విషయాన్ని షకీబ్ ఎవరికీ చెప్పలేదు.

ఇది ఐసీసీ నిబంధనలు ఆర్టికల్‌ 2.4.4 ప్రకారం నేరం. అలాగే 2018లో ఐపీఎల్‌ ఆడేప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా బుకీలు షకీబ్‌ను సంప్రదించారు. దీనిని కూడా షకీబ్ వెల్లడించలేదంటూ మరో అభియోగం నమోదైంది.ఈ క్రమంలో ఐసీసీ అవినీతి నిరోధ విభాగం జరిపిన విచారణలో షకిబ్‌ తన తప్పులను అంగీకరించాడు. నిషేధ కాలంలో ఐసీసీ నిబంధనలు సక్రమంగా పాటిస్తే 2020 అక్టోబర్‌ 29 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు