Shouldnt Praise Vaibhav Suryavanshi To The Skies Sunil Gavaskar Advice Turns Out To Be Right
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అతి తక్కువ వయసులో శతకం సాధించిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. మొత్తంగా ఆ మ్యాచ్‌లో 38 బంతులను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఈ కుర్రాడిపై ప్రశంసల వర్షం కురిసింది. క్రికెట్ ప్రపంచంలో అతడి పేరు మారుమోగిపోయింది.
క్రికెట్ ప్రపంచం మొత్తం వైభవ్ సూర్యవంశీని ప్రశంసిస్తుంటే భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం అతడిని ఎక్కువగా ప్రశంసించవద్దని చెప్పాడు. అతడు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని, అతడి ఆటను అతడిని ఆడనివ్వాలని సలహా ఇచ్చాడు.
ఐపీఎల్ మెగావేలం 2025 సమయానికి సూర్యవంశీకి 13 ఏళ్లు అన్న సంగతి తెలిసిందే. వేలంలో అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ విషయం గురించి గవాస్కర్ మాట్లాడుతూ.. అతడు మెగావేలంలో తన పేరును నమోదు చేసుకునే సమయానికి యూత్ క్రికెట్‌లో అతడు ఆస్ట్రేలియా పై టెస్టుల్లో సెంచరీ చేశాడు. 13 ఏళ్ల ఓ బాలుడు అగ్రశేణి జట్టు కాకపోయినా అంతర్జాతీయ క్రికెట్ జట్టుపై సెంచరీ చేయడం అతడిని ప్రతిభను చూపిస్తుందన్నాడు. అప్పటి నుంచి అతడు క్రమంగా ముందుకు సాగుతూనే ఉన్నాడు అని ముంబై, రాజస్థాన్ మ్యాచ్‌కు ముందు జియో స్టార్‌తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు.
అతడు తన ఆటను ఇంకా మెరుగుపరచుకుంటాడని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ‘రాహుల్ ద్రవిడ్‌తో కూర్చొని తన ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలి అన్న విషయాలను అతడు నేర్చుకుంటాడు. అతడు మరింత మెరుగుఅవుతాడు. అతడిని మనం ఇప్పుడే ఆకాశానికి ఎత్తేయడం బాగాలేదు. అని సునీల్ గవాస్కర్ చెప్పాడు.
తొలి బంతినే సిక్స్ కొట్టాలనే భావన కలుగుతుంది. అతడు ప్రతిసారి అలా చేయకూడదు. ఎందుకంటే అనుభవజ్ఞులైన బౌలర్లు షార్ట్ బాల్స్ సంధించే అవకాశం ఉంది. అప్పుడు అతడు ఔట్ కావచ్చు. ఆ సమయంలో అతడు ఆందోళన చెందుతాడు. అనవసర విషయాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
సూర్యవంశీ డకౌట్..
గుజరాత్ పై సెంచరీ చేయడంతో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అతడు ఎలా ఆడతాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే.. ఈ కుర్రాడు మాత్రం క్రీజులోకి అలా వెళ్లి ఇలా వచ్చాడు. తొలి ఓవర్‌లోనే డకౌట్ అయ్యాడు. కేవలం రెండు బంతులను మాత్రమే ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో విల్‌జాక్స్ క్యాచ్ అందుకోవంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
దీంతో గవాస్కర్ చెప్పినది నిజమైంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.