శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు… ఇటువంటి ఘనత సాధించిన ఒకే ఒక్క కెప్టెన్ ఇతడు
దీంతో శ్రేయస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Pic@ : @PunjabKingsIPL and @RCBTweets
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా నిన్న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచులో పంజాబ్ గెలిచి, ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచు జరిగింది.
ఈ మ్యాచులో గెలిచి 11 ఏళ్ల తర్వాత పంజాబ్ జట్టు ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. పంజాబ్ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. నిన్నటి మ్యాచులో 87 పరుగులు చేసి అతడు నాటౌట్‌గా నిలిచాడు.
శ్రేయస్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను అందుకున్నాడు. 3 వేర్వేరు జట్లకు ప్రాతనిధ్యం వహించి ఆయా జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఒకే ఒక్క కెప్టెన్‌గా శ్రేయస్ నిలిచాడు. ఐపీఎల్ 2020లో ఢిల్లీ జట్టును అతడు ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత 2024 సీజన్‌లో కోల్‌కతా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను కూడా కెప్టెన్‌గా ఫైనల్‌కు తీసుకెళ్లాడు. దీంతో శ్రేయస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
కోచ్‌గా రికీ పాంటింగ్ రికార్డు
మూడు వేర్వేరు జట్లను ఐపీఎల్ ఫైనల్స్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్ నిలవగా, పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా అటువంటి రికార్డునే తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు జట్లను ఐపీఎల్ ఫైనల్‌కు తీసుకెళ్లిన మొదటి ప్రధాన కోచ్‌గా పాంటింగ్ నిలిచాడు.
పాంటింగ్ 2015లో ముంబైని, 2020లో ఢిల్లీని, ఇప్పుడు పంజాబ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఇక, డేనియల్ వెట్టోరి, స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్‌గా రెండేసి జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లారు.
నిన్నటి మ్యాచులో మొదట ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసి, 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది.