Shreyas Iyer to replace Rohit as Indias new ODI captain report
Shreyas Iyer : సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలోనే భారత్ బరిలోకి దిగనుంది. అతడికి డిప్యూటీగా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేశారు. అయితే.. మంచి ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer )కు మాత్రం 15 మంది సభ్యులు గల జట్టులో చోటు దక్కలేదు. దీంతో సెలక్టర్ల నిర్ణయం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ను నియమించాలని భావిస్తున్న మేనేజ్‌మెంట్ తమ నిర్ణయం పై పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం టీ20లకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా, వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక టెస్టులకు శుభ్‌మన్ గిల్ సారథిగా ఉన్నాడు.
టీ20 క్రికెట్‌లో గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో భవిష్యత్తులో అతడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని తేలిపోయింది. అటు వన్డేల్లో రోహిత్ శర్మ వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు ఆడాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో రోహిత్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి శ్రేయస్ అయ్యర్‌ను వన్డే ప్రపంచకప్ 2027 వరకు కెప్టెన్ గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వన్డే ప్రపంచకప్ తరువాత కూడా గిల్‌కు వన్డేల్లో నాయకత్వ బాధ్యతలను అప్పగించకపోవచ్చునని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకప్పుడు మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉన్నప్పటికి కూడా అతడిపై పెద్దగా భారం ఉండేది కాదు. ఎందుకంటే ఆ సమయంలో ఇన్ని టోర్నీలు, సిరీస్‌లు ఉండేవి కావు అన్నది నిజం. ప్రస్తుతం టెస్టుల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్, వన్డేల్లో ప్రపంచకప్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ, ఇక టీ20ల్లో ప్రపంచకప్ ఇలా మెగాటోర్నీల సంఖ్య ఎక్కువగానే ఉంది. వీటితో పాటు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆసియాకప్‌ను ఉండనే ఉంది.
ఇంత బిజీ షెడ్యూల్‌లో కెప్టెన్ పై వర్క్‌లోడ్ అధికంగా ఉండే అవకాశం ఉంది. వన్డేల్లో కెప్టెన్సీ బాధ్యతలు మొదట గిల్‌కే అప్పగించాలని మేనేజ్‌మెంట్ అనుకుంది. అయితే.. వర్క్‌లోడ్ అధికమైతే అది గిల్ బ్యాటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అయిన నేపథ్యంలో వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో వన్డేల్లో రోహిత్ కు బదులుగా శ్రేయస్ ను నాయకుడిగా నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Vinod Kambli : వినోద్ కాంబ్లీ ఇంకా పూర్తిగా కోలుకోలేదా? అతడి సోదరుడు ఏం చెప్పాడంటే?
ఆసియాకప్ ముగిసిన తరువాత సెలక్టర్లు సమావేశం అవుతారని, ఆ మీటింగ్‌లో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవితవ్యం పై చర్చిస్తారని, అప్పుడే శ్రేయస్‌ను కెప్టెన్‌గా నియమిస్తారని అంటున్నారు. టీమ్ఇండియా అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య ఆసీస్‌తో భారత్ వన్డే సిరీస్‌తో పాటు టీ20 సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కు ముందు వన్డే కెప్టెన్సీ పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.