South Africa win the WTC final 2025 against Australia and lift the title
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 విజేతగా దక్షిణాఫ్రికా నిలిచింది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో తొలిసారి డబ్ల్యూటీసీ టైటిల్‌ను దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది.
282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సఫారీ బ్యాటర్లలో ఐడెన్ మార్క్‌క్రమ్ (136) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ టెంబా బవుమా (66) హాప్ సెంచరీ బాదగా, డేవిడ్ బెడింగ్‌హామ్ (21 నాటౌట్) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్ , జోష్ హేజిల్‌వుడ్‌లు చెరో ఓ వికెట్ తీశారు.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. టీమ్ఇండియా ఓపెనర్లు ఫిక్స్.. బీసీసీఐ చెప్పేసింది..
బవుమా తొందరగానే ఔటైనా..
282 పరుగుల లక్ష్య ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. మార్‌క్రమ్ (102), బవుమా(65) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయానికి మరో 69 పరుగులు చేయాల్సి ఉంది.
ఈ క్రమంలో విజయమే లక్ష్యంగా నాలుగో రోజు ఆటను 213/2 స్కోరు వద్ద కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓవర్ నైట్ స్కోరుకు మరో పరుగు మాత్రమే జత చేసిన కెప్టెన్ టెంబా బవుమా.. కమిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ కేరీ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. మరికాసేటికే ట్రిస్టన్ స్టబ్స్ (8) సైతం మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో 241 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లాగా సఫారీలు మరోసారి కుప్పకూలుతారేమోనని అనిపించింది. అయితే.. శతక వీరుడు మార్‌క్రమ్ మాత్రం తన పట్టు విడువ లేదు. డేవిడ్ బెడింగ్‌హామ్ సాయంతో జట్టును ముందుకు నడిపించాడు. ఈ జంట చాలా చక్కటి టెస్టు క్రికెట్ ఆడింది. వికెట్ మధ్య పరుగులు తీస్తూ లక్ష్యాన్ని కరిగించుకుంటూ పోయింది. జట్టు విజయానికి మరో 6 పరుగులు అవసరమైన దశలో మార్‌క్రమ్.. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు.
మార్‌క్రమ్, డేవిడ్ బెడింగ్‌హామ్ జోడి ఐదో వికెట్‌కు 35 పరుగులు జోడించారు. మార్‌క్రమ్ ఔటైనా దక్షిణాఫ్రికాకు చింతించాల్సిన పని లేకుండా పోయింది. వికెట్ కీపర్ కైల్ వెర్రెయిన్ (7 నాటౌట్) జతగా డేవిడ్ బెడింగ్‌హామ్ జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 212 పరుగులు చేసింది. ఆ తరువాత దక్షిణాప్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌కు 74 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆసీస్ ఆలౌట్ కాగా.. సఫారీల ముందు 282 లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించి డబ్ల్యూటీసీ విజేతగా నిలిచింది.