Sunil Gavaskar questions Rohit batting approach ahead of Champions Trophy 2025 final
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ వరుస విజయాలతో ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, గిల్‌లు ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. మెరుగైన ఆరంభాలను దక్కించుకుంటున్నప్పటికి వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. దీంతో రోహిత్ శర్మ ఫామ్ పై విమర్శలు వస్తున్నాయి.
కాగా.. రోహిత్ శర్మ పై వస్తున్న విమర్శలను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. రోహిత్‌కు మద్దతు ఇచ్చాడు. కెప్టెన్ గా హిట్‌మ్యాన్ దూకుడుగా ఆడుతుంటే జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా భిన్నంగా ఉంటోందని వ్యాఖ్యానించాడు. అయితే.. గంభీర్ వ్యాఖ్యలతో సునీల్ గవాస్కర్ ఏకీభవించలేదు. రోహిత్ శర్మ బ్యాటింగ్ విధానాన్ని ప్రశ్నించాడు.
రోహిత్ శర్మ కనీసం 25 ఓవర్లు ఆడితే.. టీమ్ఇండియా 50 ఓవర్లలో ఈజీగా 350 ఫ్లస్ పరుగులు చేస్తుందని ఇండియా టుడేతో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు. గత కొన్నాళ్లుగా హిట్‌మ్యాన్ దూకుడుగానే ఆడుతున్నాడు. కొన్నిసార్లు ఇది విజయవంతం అయినప్పటికి చాలా సార్లు విఫలం అవుతున్నాడని చెప్పుకొచ్చాడు. రోహిత్ ప్రతిభకు తగ్గ ఇన్నింగ్స్‌లు రావడం లేదన్నాడు.
మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే రోహిత్ శర్మ నైపుణ్యాలు చాలా ప్రత్యేకమైనవని గవాస్కర్ తెలిపారు. అద్భుతమైన షాట్లు కొట్టగలిగే నైపుణ్యం అతడి సొంతం అని చెప్పారు. ఒకవేళ రోహిత్ శర్మ 25 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేస్తే అప్పటికి భారత స్కోరు 180 నుంచి 200 మధ్య ఉంటుంది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఉంటారని అనుకుంటే.. ఆ తరువాత వచ్చే బ్యాటర్లు ఇంకా దూకుడుగా ఆడతారు. అప్పుడు అవలీలగా 350 కంటే ఎక్కువ పరుగులు చేయొచ్చు అని గవాస్కర్ అన్నారు.
రోహిత్ శర్మను దూకుడుగా ఆడవద్దని తాను అనడం లేదని, కానీ.. 25 నుంచి 30 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయాలని మాత్రమే తాను సూచిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఓ బ్యాటర్‌గా 25 నుంచి 30 పరుగులు చేసి సంతోషంగా ఉండగలరా అని హిట్‌మ్యాన్‌ను ప్రశ్నించాడు. జట్టుపై ప్రభావం ఎక్కువగా ఉండాలంటే కనీసం 25 ఓవర్లు అయినా బ్యాటింగ్ చేయాలని గవాస్కర్ హిట్‌మ్యాన్‌కు సూచించాడు.