Sunil Gavaskar Warning To Pakistan Ahead Of Asia Cup 2025 Final
Sunil Gavaskar : దుబాయ్ వేదికగా ఆసియాకప్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు పోటీపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ధీమాను వ్యక్తం చేశాడు.
ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రమే ప్రతి మ్యాచ్‌లోనూ రాణించాడు. అతడు మినహా మిగిలిన ఆటగాళ్లు అందరూ నిలకడగా ఆడడం లేదు. దీనిపై గవాస్కర్ మాట్లాడుతూ.. ఫైనల్ మ్యాచ్‌లోనూ అభిషేక్ రాణించాలని కోరుకున్నాడు. అతడితో పాటు శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యాలు బ్యాట్ ఝుళిపించాలన్నాడు.
IND vs PAK : పాక్‌తో ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. ఈ ‘మూడు’ మారాల్సిందే..
‘ఒంటి చేత్తో మ్యాచ్ గమనాన్ని మార్చే ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. సూర్య పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అలాగే తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యాల నుంచి ఓ పెద్ద ఇన్నింగ్స్ బాకీ ఉంది. గిల్ కూడా మంచి ఆరంభాలను అందుకుంటూ ఉన్నా కూడా అతడి నుంచి కూడా ఓ భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. అభిషేక్‌తో పాటు వీరిలో ఒక్కరైనా పెద్ద ఇన్నింగ్స్ ఆడినా చాలు.’ అని గవాస్కర్ అన్నాడు.
ఈ టోర్నీలో మూడు సార్లు అభిషేక్ శర్మ అర్థసెంచరీలు పూర్తి చేసుకున్నాడు. అయితే.. వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు. దీనిపై గవాస్కర్ మాట్లాడుతూ.. గత మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు రనౌట్‌గా ఔటై.. సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఫైనల్ మ్యాచ్‌లో అతడు మూడు అంకెల స్కోరును అందుకునే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. అని తెలిపాడు.
ఇక ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని, భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమ్ఇండియాను అడ్డుకోవడం పాక్‌కు అంత సులభం కాదన్నాడు.