IND vs PAK : పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించాలంటే.. ఈ ‘మూడు’ మారాల్సిందే..

ఆసియాక‌ప్ 2025 ఫైన‌ల్ మ్యాచ్‌లో (IND vs PAK ) భార‌త్, పాక్ జ‌ట్లు దుబాయ్ వేదిక‌గా త‌ల‌ప‌డ‌నున్నాయి.

IND vs PAK : పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించాలంటే.. ఈ ‘మూడు’ మారాల్సిందే..

Asia Cup 2025 Final Team India must rectify these mistakes

Updated On : September 28, 2025 / 11:34 AM IST

IND vs PAK : ఆసియాక‌ప్ 2025లో భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. నేడు చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌తో దుబాయ్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌తో భార‌త్ రెండు సార్లు త‌ల‌ప‌డింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భార‌త జ‌ట్టే విజ‌యం సాధించింది. అయితే.. తొలి మ్యాచ్‌లో ఏక‌ప‌క్షంగా భార‌త్ గెల‌వ‌గా, రెండో మ్యాచ్‌లో పాక్ కాస్త పోటీ ఇచ్చింది. ఈ క్ర‌మంలో ఫైన‌ల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవ‌కాశాలు ఉన్నాయి.

కెప్టెన్సీ భారంగా మారిందా?

ఒక్ప‌ప్పుడు సూర్య‌కుమార్ యాద‌వ్ క్రీజులో ఉన్నాడంటే ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్లు అత‌డికి ఎలా బౌలింగ్ చేయాలోన‌ని అనుక్ష‌ణం భ‌య‌ప‌డేవారు. త‌న‌దైన మార్క్ షాట్ల‌తో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ భార‌త్‌కు ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్‌ల్లో విజ‌యాల‌ను అందించాడు. అయితే.. కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అందుకున్న త‌రువాత సూర్య‌ బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న ప‌డిపోయింది అన్న‌ది కాద‌న‌లేని నిజం. ఆసియాక‌ప్ 2025లో ఒకే ఒక ఇన్నింగ్స్‌లో కాస్త రాణించాడు. లీగ్ స్టేజీలో పాక్ పై 47 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

Abhishek Sharma : పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్‌.. రోహిత్, కోహ్లీ, రిజ్వాన్‌ల రికార్డుల‌ను అభిషేక్ శ‌ర్మ‌ బ్రేక్ చేస్తాడా?

ఒమ‌న్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కే రానీ సూర్య‌, సూప‌ర్‌-4లో పాక్‌తో మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు. బంగ్లాదేశ్ పై 5 ప‌రుగులు చేయ‌గా శ్రీలంక పై 12 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్‌లోనైనా పాత సూర్య‌ని చూడాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అత‌డు జ‌ట్టును ముందుండి న‌డిపించాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

ఫీల్డింగ్‌లో మెరుగు అవ్వాల్సిందే..

క్రికెట్‌లో క్యాచ్‌లు ప‌డితేనే మ్యాచ్‌లు గెలుస్తారు అనే ఒక నానుడి ఉంది. ఒక్క క్యాచ్ మిస్ చేసినా కూడా మ్యాచ్ చేజారిన సంద‌ర్భాల‌ను ఎన్నో చూశాం. ఆసియాక‌ప్‌లో టీమ్ఇండియా ఫీలర్లు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు 13కు పైగా క్యాచ్‌ల‌ను వ‌దిలేశారు అంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రోవైపు పాక్ ఇప్ప‌టి వ‌ర‌కు 4 క్యాచ్‌ల‌ను మాత్ర‌మే మిస్ చేసింది.

WI vs NEP : టీ20 క్రికెట్‌లో నేపాల్ సంచ‌ల‌నం.. తొలి టీ20లో వెస్టిండీస్ పై విజ‌యం

ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త ఫీల్డింగ్ మెరుగుప‌డితేనే పాక్‌ను త‌క్కువ స్కోరుకు ప‌రిమితం చేయొచ్చు. సూప‌ర్‌-4లో జ‌రిగిన మ్యాచ్‌లో అర్ధ‌శ‌త‌కం బాది గ‌న్ ఫైర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్న పాక్ ఆట‌గాడు ఫ‌ర్హాన్ డ‌కౌట్ కావాల్సి ఉంది. చేతిలోకి వ‌చ్చిన క్యాచ్‌ను అభిషేక్ శ‌ర్మ మిస్ చేశాడు. ఒక‌వేళ అత‌డు త్వ‌ర‌గా ఔటై ఉంటే అప్పుడు పాక్ త‌క్కువ స్కోరుకే ప‌రిమిత‌మ‌య్యేది. అందుక‌నే ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త ఫీల్డ‌ర్లు ఎలాంటి త‌ప్పిదాలు చేయ‌కూడ‌దు.

మిడిల్ ఆర్డ‌ర్ మెరుపులు..

ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ మెరుపు ఆరంభాల‌ను ఇచ్చాడు. అయితే.. ఆ త‌రువాత వ‌చ్చే బ్యాట‌ర్లు పెద్ద‌గా ఆక‌ట్టుకోవ‌డం లేదు. తిల‌క్ వ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, శివ‌మ్‌దూబెలు అప్పుడ‌ప్పుడు మిన‌హా వారిలో నిల‌క‌డ లోపించింది. ఒక‌వేళ ఫైన‌ల్ మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ విఫ‌లం అయితే.. మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాళ్లు బాధ్య‌తాయుతంగా ఆడాల్సి ఉంటుంది. అభిషేక్ రాణిస్తే.. వీరు జట్టుకు భారీ స్కోరు అందించాల్సి ఉంది.