pic credit @ BCCI
IND vs UAE : ఆసియాకప్ 2025 ను భారత్ ఘనంగా మొదలెట్టింది. మొదటి మ్యాచ్‌లో పసికూన యూఏఈను చిత్తు చిత్తుగా ఓడించింది. తొమ్మిది వికెట్ల తేడాతో మరో 93 బంతులు మిగిలి ఉండగానే భారత్ గెలుపొందింది. ఇక భారత జట్టు ఈ మెగాటోర్నీలో తమ తదుపరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 14 (ఆదివారం) న ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో యూఏఈని చిత్తుగా ఓడించి పాక్‌కు గట్టి సందేశం పంపారా అని టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఓ ప్రశ్న ఎదురుకాగా అతడు ఆసక్తికర సమాధానం చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో యూఏఈ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్లు అలిషన్ షరాఫు (22; 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), మహ్మద్ వసీమ్ (19; 22 బంతుల్లో 3 ఫోర్లు) లు ఫర్వాలేదనిపించారు. మిగిలిన ఎవ్వరూ కూడా కనీసం 3 పరుగులు కూడా ధాటలేకపోయారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ (4/7) నాలుగు వికెట్లు తీయగా, శివమ్ దూబె (3/4) మూడు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, అక్షర్, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (30; 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (20 నాటౌట్; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (7 నాటౌట్; 2 బంతుల్లో 1 సిక్స్) మెరుపులు మెరిపించారు.
మ్యాచ్ అనంతరం కామెంటేటర్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. టీమ్ఇండియా అద్భుత విజయాన్ని సాధించిందని అన్నాడు.ఇది నమ్మశక్యంగా లేదని, పూర్తి ఆదిపత్యాన్ని చూపించారన్నాడు. మ్యాచ్ త్వరగా ముగియడం గురించి మాట్లాడుతూ.. మీరు పూర్తి మ్యాచ్ ఫీజును పొందుతారో లేదో అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. ఇది విన్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నవ్వకుండా ఉండలేకపోయాడు. దాని గురించి తరువాత మాట్లాడుకుందామని చెప్పాడు.
మొదటి మ్యాచ్‌ల్లోనే కుర్రాళ్లు అదరగొట్టాడని అన్నాడు. ఈ మెగాటోర్నీ మొత్తం ఇదే విధంగా దూకుడుగా ఆడుతామని చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇక్కడ మ్యాచ్‌లు ఆడిన అనుభవం మా ప్లేయర్లు ఉందన్నాడు. పిచ్ కాస్త నెమ్మదిగా ఉంటుందని అనిపించిందన్నాడు.
పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి తొలుత బౌలింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు. స్పిన్నర్లు తమ పాత్రను చాలా అద్భుతంగా పోషించారన్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ పిచ్ తీరు పెద్దగా మారలేదన్నాడు. ఈ అనుభవం పాక్‌తో మ్యాచ్‌లో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు.
కుల్దీప్ యాదవ్ చక్కగా బౌలింగ్ చేశాడని, అతడికి దూబె, హార్దిక్, అక్షర్, బుమ్రాల నుంచి మంచి మద్దతు లభించిందన్నాడు. అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతూ.. లక్ష్య ఛేదనలో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు ఓపెనర్‌గా ఉన్నప్పుడు అసలు టెన్షనే ఉండదని చెప్పుకొచ్చాడు. టార్గెట్ 50 లేదా 200 అనే విషయాన్ని అతడు చూడడని తెలిపాడు. తనదైన శైలిలో దూకుడుగా ఆడడమే అతడికి తెలుసునని చెప్పాడు.
ఈ విజయంతో పాక్‌కు గట్టి సందేశం పంపినట్లేనా అని కామెంటేటర్ మంజ్రేకర్ అడుగుగా.. సూర్య ఇలా స్పందించాడు. పాక్‌తో మ్యాచ్ కోసం తామంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. ఆ మ్యాచ్‌లోనూ రాణించాలని కోరుకుంటున్నానని అన్నాడు.
మరోసారి కామెంటేటర్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. టీమ్ఇండియా అద్భుత విజయాన్ని సాధించిందని అన్నాడు.ఇది నమ్మశక్యంగా లేదని, పూర్తి ఆదిపత్యాన్ని చూపించారన్నాడు. మ్యాచ్ త్వరగా ముగియడం గురించి మాట్లాడుతూ.. మీరు పూర్తి మ్యాచ్ ఫీజును పొందుతారో లేదో అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. ఇది విన్న సూర్యకుమార్ యాదవ్ నవ్వకుండా ఉండలేకపోయాడు. దాని గురించి తరువాత మాట్లాడుకుందామని చెప్పాడు.