Duleep Trophy Final : ఇలాగైతే చోటు కష్టమే.. విఫలమైన పుజారా, సూర్యకుమార్.. సర్ఫరాజ్ ఖాన్ డకౌట్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్‌లో విఫలం కావడంతో పుజారా (Pujara) పై వేటు పడగా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నా టెస్టు జట్టులో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు చోటు దక్కడం లేదు.

Suryakumar Yadav - Pujara
Duleep Trophy : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్‌లో విఫలం కావడంతో పుజారా (Pujara) పై వేటు పడగా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నా టెస్టు జట్టులో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు చోటు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరు దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించారు. ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ ఫైనల్ (Duleep Trophy Final) మ్యాచ్‌లో వెస్ట్ జోన్ తరుపున బరిలోకి దిగిన వీరు ఘోరంగా విఫలం అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో పుజరా 9, సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులు మాత్రమే చేశారు. కాగా.. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న పృథ్వీ షా (65) అర్థశతకంతో రాణించాడు. ఇటీవల వార్తల్లో నిలిచిన సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ కావడం గమనార్హం.
దులిప్ ట్రోఫీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సౌత్, వెస్ట్ జోన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. హనుమ విహారి(63), తిలక్ వర్మ(40)లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 213 పరుగులు చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్ట్ జోన్ కు కష్టాలు తప్పడం లేదు. పృథ్వీ షా హాఫ్ సెంచరీతో రాణించినా కెప్టెన్ ప్రియాంక్ ప్రాంచల్ (11), సూర్యకుమార్ యాదవ్, పుజరా, సర్ఫరాజ్ ఖాన్‌లు విఫలం కావడంతో 124 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 129 7తో నిలిచింది. అతిత్ షెత్(5), ధర్మేంద్రసింగ్ జడేజా(4) క్రీజులో ఉన్నారు. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కన్నా ఇంకా 84 పరుగులు వెనకబడి ఉంది.
ఇలాగైతే కష్టమే..
దేశవాలీలో పరుగుల వరద పారించి మళ్లీ టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవాలని భావిస్తున్న పుజారా, సూర్యకుమార్‌లు ఇలా ఆడితే కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పుజారా వయస్సు దృష్ట్యా మరో రెండు, మూడు ఏళ్లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఇలాగే అతడు విఫలం అయితే మళ్లీ టీమ్ఇండియాలో అతడిని చూసే అవకాశం ఉండకపోవచ్చు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్ టెస్టులకు తగ్గట్లుగా తన ఆట తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లు వీరి స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉంది. కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా వీరు రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
WI vs IND : వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు ఎవరో తెలుసా..?