WI vs IND : వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త బ్యాట‌ర్లు ఎవ‌రో తెలుసా..?

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(WTC) కొత్త సైకిల్ 2023-25లో భాగంగా వెస్టిండీస్‌తో టీమ్ఇండియా త‌ల‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో వెస్టిండీస్‌పై అత్య‌ధిక ప‌రుగులు సాధించిన భార‌త బ్యాట‌ర్లు ఎవ‌రో చూద్దాం.

WI vs IND : వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త బ్యాట‌ర్లు ఎవ‌రో తెలుసా..?

Indias highest run scorers

West Indies vs India : ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(WTC) కొత్త సైకిల్ 2023-25లో భాగంగా వెస్టిండీస్‌తో టీమ్ఇండియా త‌ల‌ప‌డ‌నుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భార‌త్ ఇప్ప‌టికే వెస్టిండీస్‌కు చేరుకుంది. ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో ఖాతాను ఓపెన్ చేయ‌డంతో పాటు మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకోవాల‌ని టీమ్ఇండియా త‌హ‌త‌హ‌లాడుతోంది. జూలై 12 నుంచి రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్లు ఎన్ని టెస్టు మ్యాచుల్లో త‌ల‌ప‌డ్డాయి. వెస్టిండీస్‌పై అత్య‌ధిక ప‌రుగులు సాధించిన భార‌త బ్యాట‌ర్లు ఎవ‌రో చూద్దాం.

టీమ్ఇండియా, వెస్టిండీస్ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 98 టెస్టుల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో టీమ్ఇండియా 22 మ్యాచుల్లో విండీస్ 30 మ్యాచుల్లో విజ‌యం సాధించాయి. ఈ సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్ ఇరు జ‌ట్ల మ‌ధ్య వందో మ్యాచ్ కానుండ‌డం విశేషం.

విండీస్ పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త బ్యాట‌ర్లు వీరే..

సునీల్ గ‌వాస్క‌ర్‌..

భార‌త లిటిల్ మాస్ట‌ర్ వెస్టిండీస్ పై టెస్టుల్లో టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడు. విండీస్ పై 27 టెస్టులు ఆడిన స‌న్నీ 48 ఇన్నింగ్స్‌ల్లో 65.45 సగటుతో 2,749 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, ఏడు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 236 నాటౌట్‌.

రాహుల్ ద్రవిడ్..

ప్ర‌స్తుత టీమ్ఇండియా హెడ్ కోచ్‌, అభిమానులు ముద్దుగా ది వాల్ అని పిలుచుకునే రాహుల్ ద్రావిడ్ ఈ జాబితాలో రెండో ఆట‌గాడు. 23 టెస్టుల్లో 63.80 సగటుతో 1,978 పరుగులు చేశాడు. 38 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు, 13 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 146.

వీవీఎస్ లక్ష్మణ్..

హైద‌రాబాద్ సొగ‌స‌రీ బ్యాట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 22 మ్యాచులు ఆడిన ల‌క్ష్మ‌ణ్‌ 36 ఇన్నింగ్స్‌లలో 57.16 సగటుతో 1,715 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 176.

సచిన్ టెండూల్కర్..

క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 21 మ్యాచ్‌లు ఆడిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌ 32 ఇన్నింగ్స్‌ల్లో 54.33 సగటుతో 1,630 పరుగులు చేశాడు. ఇందులో మూడు శ‌త‌కాలు, 10 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 179.

దిలీప్ వెంగ్‌సర్కార్..

దిలీప్ వెంగ్ స‌ర్కార్ ఐదో స్థానంలో ఉన్నాడు. 25 మ్యాచులు ఆడిన వెంగ్ స‌ర్కార్‌ 40 ఇన్నింగ్స్‌ల్లో 44.33 సగటుతో 1,596 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శ‌త‌కాలు, ఏడు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 159.