T20 World Cup 2021 : సిక్స్‌తో బట్లర్ సెంచరీ.. శ్రీలంక టార్గెట్ 164

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా షార్జా వేదికగా శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా షార్జా వేదికగా శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో జోస్‌ బట్లర్‌ (101-నాటౌట్) సెంచరీ బాదాడు. ఆరంభంలో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినప్పటికీ.. చివర్లో చేతులెత్తేశారు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ మూడు, దుష్మంత చమీర ఒక వికెట్ తీశారు.

Exercise : క్యాన్సర్ రోగులు వ్యాయామాలు చేయటం మంచిదేనా?..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. పవర్‌ ప్లే పూర్తయ్యేలోపు 36 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వనిందు హసరంగ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (9) బౌల్డయ్యాడు. ఐదో ఓవర్ లో డేవిడ్‌ మలన్‌ (6) బౌల్డ్ కాగా.. ఆరో ఓవర్లో జానీ బెయిర్‌ స్టో డకౌటయ్యాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌తో కలిసి జోస్ బట్లర్‌ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని నిలబెట్టాడు. ఈ క్రమంలోనే 14వ ఓవర్లో బట్లర్‌ హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ వేగం పెంచారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దూకుడుగా ఆడే క్రమంలో హసరంగ వేసిన 19వ ఓవర్లో మోర్గాన్ (40) ఔటయ్యాడు.

ఆఖరి ఓవర్‌ చివరి బంతికి బట్లర్ సిక్స్‌ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. మొయిన్‌ అలీ (1) నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో లంక బౌలర్లు పట్టు సడలించడంతో.. ఆ అవకాశాన్ని ఇంగ్లాండ్‌ బ్యాటర్లు సద్వినియోగం చేసుకుని భారీగా పరుగులు రాబట్టారు. 164 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

Elon Musk To WFP : రూ. 45వేల కోట్లు ఇస్తా..ఆకలి సమస్య తీర్చగలరా?

గ్రూప్-1లో ఉన్న ఈ రెండు జట్లు చెరో మూడు మ్యాచ్ లు ఆడాయి. సూపర్-12 దశలో ఇంగ్లండ్ తాను ఆడిన మూడు మ్యాచుల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక కేవలం ఒక మ్యాచ్ లోనే నెగ్గింది.

ట్రెండింగ్ వార్తలు