Pic Credit_ @BCCI
ఐపీఎల్ ఇలా ముగిసిందో లేదో…టీ 20 ఫీవర్ మొదలైపోయింది. 2007 తర్వాత మరోసారి కప్ గెలవలేకపోయిన భారత్..ఈ సారి హాట్‌ఫేవరెట్‌గా అమెరికాలో అడుగుపెట్టింది. ఫైనల్లో ఓటమితో వన్డే వరల్డ్ కప్ మిస్సయిన టీమిండియా ఈ సారి మాత్రం ఎలాగైనా పొట్టి క్రికెట్ కప్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. వెస్టెండీస్, అమెరికా సంయుక్తంగా మొదటిసారి ఆతిథ్యం ఇస్తున్న ఈ టీ 20క్రికెట్ వరల్డ్‌కప్‌కు అనేక విశేషాలున్నాయి. 20 ఫార్మాట్ కప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. అమెరికా, కెనడా, ఉగాండా తొలిసారి టీ 20 వరల్డ్‌కప్‌లో ఆడుతున్నాయి.
ఈ టీ 20 వరల్డ్‌కప్‌లో భారత్‌కు విజయావకాశాలు ఎలా ఉన్నాయి..? ఏఏ జట్లు ఫైనల్‌కు చేరే అవకాశముంది..? 2007 నాటి మ్యాజిక్ రిపీట్ చేసే అవకాశం రోహిత్ సేనకు లభిస్తుందా..? సొంత గడ్డపై పొట్టి క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరంగా ఆడే వెస్టెండీస్, వరల్డ్‌కప్ కోసం సర్వశక్తులూ ఒడ్డే ఆస్ట్రేలియా, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు ఇతర జట్లను ఓడించి భారత్ కప్ కైవసం చేసుకుంటుందా..?
ఆ విజయమే కారణం
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్‌కు భారతే ఆధారం. అలాగే టీ 20 క్రికెట్‌కు భారత్‌లో ఉన్నంత ప్రాధాన్యత మరేదేశంలోనూ లేదు. 17 ఏళ్ల క్రితం టీమిండియా మహేంద్రసింగ్ ధోనీ ఆధ్వర్యంలో గెలిచిన టీ 20 తొలి వరల్డ్‌కప్..భారత క్రికెట్ దశను మార్చివేసింది.
ఐపీఎల్ రూపంలో రిచ్ క్యాష్ లీగ్ ఆవిష్కరణకు…భారత్‌లో క్రికెట్ కాసులు కురిపించే ఆటగా మారడానికి ఆ విజయమే కారణం. 2008లో ఐపీఎల్ మొదలైన దగ్గరనుంచి మన క్రికెటర్లు ఎక్కవగా టీ20మ్యాచ్‌లు ఆడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్‌లో ఈ ఫార్మాట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడడం భారత్‌కు బలం. అయితే ఇన్ని అనుకూల అంశాలు ఉన్నప్పటికీ 2007 తర్వాత భారత్ మరోసారి కప్ గెలవలేకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. అందుకే ఈ సారి ఎలాగైనా భారత్ కప్ గెలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
టీ 20 ప్రపంచ కప్ ఇప్పటిదాకా భారత్, వెస్టెండీస్, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. వీటిలో వెస్టెండీస్, ఇంగ్లండ్ రెండు సార్లు కప్ సాధించగా..మిగిలిన దేశాలు ఒక్కొక్కసారి గెలిచాయి. ఈ సారి కప్ భారత్‌దే అని అభిమానులు నమ్మడానికి కారణం రోహిత్ సేన అత్యంత బలంగా ఉండడం.
అంచనాలకు మించి ఆటగాళ్లు రాణించి 17 ఏళ్ల నిరీక్షణకు తలదించుతారన్నది అభిమానుల ఆశ. 2007లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి కప్ సాధించిన భారత్ తర్వాత నుంచి మాత్రం పొట్టి వరల్డ్ కప్‌లో ఆ స్థాయి ఆట తీరు కనబరచలేదు. హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి నిరాశగా వెనుతిరుగుతోంది. 2014లో మినహా ఇంకెప్పుడూ ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. 2022లో సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలై వెనుతిరిగింది. ఈ సారి మాత్రం అలాంటి ప్రతికూల ఫలితాలేవీ రావని….రోహిత్‌సేన కప్ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు.
ఆతిథ్య వెస్టెండీస్ ఈ సారి టైటిల్ ఫేవరెట్ రేసులో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, నిలకడగా ఆడే న్యూజిలాండ్, టెస్ట్, వన్డే వరల్డ్‌కప్‌ల్లో విశ్వవిజేతగా నిలిచి…టీ 20ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆస్ట్రేలియా, ఆరుసార్లు టీ 20 వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన పాకిస్థాన్‌తో భారత్‌కు గట్టి పోటీ ఎదురు కానుంది.
అయితే వెస్టెండీస్‌లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో భారత్‌కు అంత సానుకూల ఫలితాలు రాలేదు. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ కనీసం సెమీస్‌క కూడా చేరలేకపోయింది. 2010 టీ 20 ప్రపంచకప్‌లోనూ సెమీస్‌కు చేరలేకపోయింది. వెస్టెండీస్ వేదికగా ఈ సారి మాత్రం పొట్టి క్రికెట్‌లో భారత్ కథ మారుతుందని అభిమానులు ఆశలు పెంచుకున్నారు.
NRIల ప్రభావంతో అమెరికన్లు క్రికెట్ చూడడానికి ఇష్టపడుతున్నారు. ఈ వరల్డ్‌కప్‌కు ఇస్తున్న ఆతిథ్యం అమెరికాలో క్రికెట్‌కు భారీగా ప్రజాదరణ పెంచుతుందని ఐసీసీ భావిస్తోంది. ఆటపై ఆసక్తిగా ఉన్న అమెరికా ఎక్కడనుంచో తయారుచేసిన పిచ్‌లు తీసుకొచ్చి మరీ మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. ఆ దేశంలో క్రికెట్ స్టేడియంలూ భారీగా అందుబాటులోకొస్తున్నాయి. మొత్తంగా ఈ నెలంతా పొట్టి క్రికెట్ వరల్డ్ కప్‌తో ప్రపంచవ్యాప్తంగా సందడి నెలకొంది.
పొట్టి క్రికెట్‌పై మరింత ఆసక్తి
ఐపీఎల్ ముగిసిన వెంటనే మొదలైన టీ 20 వరల్డ్ కప్ మొదలవడంతో పొట్టి క్రికెట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన రోహిత్ సేనపై ఈ వరల్డ్‌కప్‌లో భారీ అంచనాలున్నాయి. 2007నాటి మ్యాజిక్‌ను టీమిండియా రిపీట్ చేసి కప్ కొట్టడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 17 ఏళ్ల ఎదురుచూపులకు ఈ సారి తెరపడుతుందని…..టీ 20 కప్ ఈ సారి భారత్‌దే అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు ఉన్నాయి. 16 మ్యాచ్‌లు అమెరికాలో జరుగుతాయి. మిగిలిన మ్యాచ్‌లకు వెస్టెండీస్ ఆతిథ్యమిస్తోంది. క్రికెట్ గురించి అసలేమీ తెలియని అమెరికా ఈ సారి టీ 20 వరల్డ్‌కప్‌లో పాల్గొనడం, వరల్డ్‌కప్‌కు ఆతిథ్య జట్టుగా ఉండడం అసలైన విశేషం. తొలి మ్యాచ్‌లో కెనడాపై భారీ విజయం సాధించింది అమెరికా. కెనడాకూ ఇదే తొలి టీ 20 వరల్డ్‌కప్.
టీ 20 వరల్డ్‌కప్‌లో భారత్ తొలి మ్యాచ్ ఈ నెల 5న ఐర్లాండ్‌తో న్యూయార్క్‌లో ఆడుతుంది. మొత్తం ఈ వరల్డ్‌కప్‌కే ప్రధాన ఆకర్షణగా, అమెరికాలో క్రికెట్‌కు భారీగా ఆదరణ పెంచే మ్యాచ్‌గా భావించే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఈ నెల 9న న్యూయార్క్‌లో జరగనుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. గ్రూప్ దశలో మ్యాచ్‌లన్నింటినీ భారత్ న్యూయార్క్, ఫ్లోరిడాలో ఆడనుంది. సూపర్ 8 మ్యాచ్‌లకు వెస్టెండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ మన కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు ప్రారంభమవుతాయి.
మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌ల్లో ఉన్నాయి. గ్రూప్ దశలో ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సెమీస్, ఫైనల్ ఉంటాయి. ఈ నెల 27న రెండు సెమీ ఫైనల్స్ జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 29న వెస్టెండీస్‌లోని బ్రిడ్జిటౌన్‌లో జరుగుతుంది. గ్రూప్ ఏలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఐర్లండ్, కెనడా, అమెరికా ఉన్నాయి.
ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా.. ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం నమోదు చేసింది. కెనడా నిర్దేశించిన 195 పరుగులును 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అమెరికాకు ఇదే అత్యధిక స్కోరు. డల్లాస్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు ఆరోన్ జోన్స్ పది సిక్సులు బాది క్రిస్ గేల్ తర్వాత ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడుగా నిలిచాడు. పొట్టి వరల్డ్ కప్ చరిత్రలోనూ అత్యధిక టార్గెట్ చేధించిన మ్యాచుల్లో ఇది మూడోది.
T20 World Cup 2024 : తొలి మ్యాచ్‌లోనే పరుగుల వరద.. అమెరికా సంచలన విజయం..