T20 World Cup Row ICC rejected Bangladesh Cricket Board request
T20 World Cup Row : భద్రతా కారణాల దృష్ట్యా టీ20 ప్రపంచకప్ 2026లో తమ జట్టు ఆడే మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తిరస్కరించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది.
బుధవారం బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిపై ఐసీసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఓటింగ్ ద్వారా నిర్ణయాన్ని తీసుకుంది. బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా 14 ఓట్లు రాగా అనుకూలంగా రెండు ఓట్లు పడ్డాయి. దీంతో బంగ్లాదేశ్ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది.
ఇక అదే సమయంలో భారత దేశంలో బంగ్లాదేశ్ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని తెలిపింది. టోర్నీలో పాల్గొంటారా? లేదా ? అనే విషయం చెప్పేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు 24 గంటలు గడువు ఇచ్చింది.
ఒకవేళ బంగ్లాదేశ్ గనుక భారత్‌కు వెళ్లేందుకు నిరాకరిస్తే వారి స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నమెంట్‌లో ఆడిస్తామని హెచ్చరించింది. దీంతో బంగ్లాదేశ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ జట్లతో కలిసి బంగ్లాదేశ్ గ్రూప్-సిలో ఉంది. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లను భారత దేశంలో బంగ్లాదేశ్ ఆడనుంది. తొలి మూడు మ్యాచ్‌లు కోల్‌కతా వేదికగా ఆడనుండగా, చివరి మ్యాచ్ ముంబైలో ఆడాల్సి ఉంది.