Abhishek Sharma : కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు.. ఆండ్రీ రస్సెల్ రికార్డు బ్రేక్..
న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) పలు రికార్డులను అందుకున్నాడు.
IND vs NZ 1st T20 Abhishek Sharma creates world record
- కివీస్‌తో తొలి టీ20లో అభిషేక్ విధ్వంసం
- పలు రికార్డులు బ్రేక్
- టీ20ల్లో 5వేల పరుగుల మైలురాయి
Abhishek Sharma : నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఓపెపర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతులను ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను సాధించాడు.
టీ20 క్రికెట్‌లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనతను అతి తక్కువ బంతుల్లో సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాడు ఆండ్రీ రస్సెల్‌ను అధిగమించాడు. టీ20 క్రికెట్‌లో 5వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు రస్సెల్‌కు 2942 బంతులు అవసరం కాగా.. అభిషేక్ 2898 బంతుల్లోనే దీన్ని అందుకున్నాడు.
పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 5 వేల పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* అభిషేక్ శర్మ – 2898 బంతుల్లో
* ఆండ్రీ రస్సెల్ – 2942 బంతుల్లో
* టిమ్ డేవిడ్ – 3127 బంతుల్లో
* విల్ జాక్స్ – 3196 బంతుల్లో
* గ్లెన్ మాక్స్‌వెల్ – 3239 బంతుల్లో
టీ20ల్లో కివీస్ పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈక్రమంలో న్యూజిలాండ్ పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మల పేరిట సంయుక్తంగా ఉంది. వీరిద్దరు చెరో 23 బంతుల్లోనే కివీస్ పై టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశారు. 2020లో హామిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, 2020లో ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఈ ఘనత సాధించారు.
ఇదిలా ఉంటే.. టీ20 క్రికెట్‌లో 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం అభిషేక్ శర్మకు ఇది ఎనిమిదో సారి. ఈ క్రమంలో అతడు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు ఫిల్‌సాల్ట్ ను అధిగమించాడు. సాల్ట్ 7 సార్లు ఈ ఘనత సాధించాడు.
టీ20లలో అత్యధిక సార్లు 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్లు వీరే..
* అభిషేక్ శర్మ – 8 సార్లు
* ఫిల్ సాల్ట్ -7 సార్లు
* సూర్యకుమార్ యాదవ్ – 7 సార్లు
* ఎవిన్ లూయిస్ – 7 సార్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అభిషేక్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఆ తరువాత 239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది.
