Team India Asia Cup 2025 celebration without trophy was Arshdeep idea
Asia Cup 2025 : దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమ్ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను చిత్తుచేసింది. కాగా.. ఈ మ్యాచ్ అనంతరం జరిగిన పరిణామాలను క్రికెట్ ప్రేమికులు అంత త్వరగా మరిచిపోరు.
భారత జట్టు విజేతగా నిలిచినా కూడా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాక్ క్రికెట్ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని తనతో పాటు హోటల్ రూమ్‌కు తీసుకుని వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అతడి చేతుల మీదుగా కప్‌తో పాటు మెడల్స్‌ను తీసుకునేందుకు సూర్య సేన నిరాకరించడంతో ఇలా చేశాడు. నఖ్వీ చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
మరోవైపు ట్రోఫీ లేకపోయినప్పటికి కూడా భారత ఆటగాళ్లు చేసుకున్న సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన సమయంలో రోహిత్ శర్మ రోబోలా వచ్చినట్లుగానే.. ఆసియాకప్ 2025 (Asia Cup 2025 ) విజయం అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అదేశైలిలో ట్రోఫీని అందించినట్లుగా చేశాడు. కాగా.. దీని వెనుక అర్ష్‌దీప్ సింగ్ ఉన్నాడని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు.
మ్యాచ్ ముగిసిన తరువాత ట్రోఫీ వస్తుందేమోనని చాలా సేపు వేచి చూసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఎంతసేపటికి కూడా ట్రోఫీ రాకపోవడంతో అర్ష్‌దీప్ సింగ్ ఓ ఐడియాను ఇచ్చాడు. కప్ లేకపోయినా కూడా ఉన్నట్లుగా చేద్దాం .. ఆ తరువాత ఫోటోలు ఎడిట్ చేసుకోవచ్చు అన్నాడు. దీంతో అంతా అలాగే చేశాం అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ చక్రవర్తి తెలిపాడు.
ఇక తాను కూడా అలాగే చేశానని, ముఖ్యంగా బెడ్ పై పడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని గుర్తు చేసుకున్నాడు. అయితే.. తన పక్కన ట్రోఫీ ఉందని అనుకుంటే కాఫీ కప్ ఉంచారని నవ్వుతూ చెప్పాడు.