Team India : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓటమి.. భారత్ ఖాతాలో చేరిన చెత్త రికార్డులు ఇవే..
భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే ముందు చాలా మంది అసలు ఈ పర్యటన అవసరమా..? బ్యాట్స్‌మెన్లు రికార్డులు మెరుగుపరచుకోవడానికి తప్ప ఇంకా ఎందుకు పనికి రాదు అంటూ మాజీ ఆటగాళ్లు ఎద్దేవా చేశారు.
Team India Unwanted Records : భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే ముందు చాలా మంది అసలు ఈ పర్యటన అవసరమా..? బ్యాట్స్‌మెన్లు రికార్డులు మెరుగుపరచుకోవడానికి తప్ప ఇంకా ఎందుకు పనికి రాదు అంటూ మాజీ ఆటగాళ్లు ఎద్దేవా చేశారు. 2023 వన్డే ప్రపంచకప్ (ODI World Cup)కు అర్హత సాధించని జట్టుతో ఆడడం అవసరమా అనే ప్రశ్నలు ఉదయించాయి. కాగా..టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లను టీమ్ఇండియా (Team India) క్లీన్ స్వీప్ చేస్తుందని అభిమానులు భావించారు.
కట్ చేస్తే.. టెస్టుల్లో 1-0 తో నెగ్గిన భారత్ వన్డేల్లో 2-1తేడాతో తృటిలో చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా ఏదో గెలిచింది. ఇక టీ20సిరీస్‌లో అయితే టీమ్ఇండియ ప్రదర్శన పేలవం. స్టార్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు లేని భారత జట్టుపై వెస్టిండీస్ 3-2 తేడాతో విజయం సాధించింది. మరికొద్ది రోజుల్లో ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లు ప్రారంభం కానుండగా ఈ ఓటమిని భారత జట్టు ఓ గుణపాఠంలా తీసుకుని రానున్న టోర్నీలలో విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
BCCI Twitter DP : ప్రధాని పిలుపు.. బ్లూ టిక్ కోల్పోయిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా..?
ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్ ఓడిపోవడంతో భారత్ ఖాతాలో కొన్ని చెత్త రికార్డులు వచ్చి చేరాయి.
– గత 25 నెలల్లో భారత్ ఓడిన మొదటి ద్వైపాక్షిక టీ20 సిరీస్ ఇదే.
– గత 17 ఏళ్లలో వెస్టిండీస్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో టీమ్ఇండియా ఓడిపోవడం ఇదే మొదటి సారి.
– ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా కోల్పోవడం ఇదే మొదటిది.
– ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విండీస్ జట్టు భారత్‌ను ఓడించడం ఇదే తొలిసారి.
– ఈ సిరీస్‌కు ముందు టీమ్ఇండియా ద్వైపాక్షిక సిరీసుల్లో మూడు టీ20 మ్యాచులు ఎప్పుడు ఓడిపోలేదు.
ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ పర్యటన ముగియడంతో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐర్దాండ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. బుమ్రా నాయకత్వంలో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. ఆగస్టు 18 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.