రాంచీ టెస్టులో భారత్ పైచేయి : దక్షిణాఫ్రికా 9/2

టీమిండియా రాంచీ టెస్టుపై కూడా పూర్తి పట్టు బిగించేసింది..బ్యాటింగ్‌లో సౌతాఫ్రికా బౌలర్లను ఓ ఆటాడుకున్న టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దగ్గర డిక్లేర్ చేసింది. అటు సఫారీల ఓపెనర్లని కూడా వెంటవెంటనే పెవిలియన్‌కి పంపేసి నట్లు బిగించేసింది.. బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు ఆట నిలిపివేసారు కానీ..లేదంటే మరో రెండు వికెట్లు టీమిండియా పడగొట్టేదనడంలో అతిశయోక్తి కాదు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రెండోరోజు 9 వికెట్లకి 497 పరుగులవద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ సఫారీల ఓపెనర్లని వెంటవెంటనే పెవిలియన్‌కి పంపడంతో. ఇక మూడోరోజు ఆట పూర్తిగా బౌలర్ల చేతిలో ఉంది.
బ్యాటింగ్‌లో భారత్ తరపున ఓపెనర్ రోహిత్‌శర్మ తన ఖాతాలో అనేక రికార్డులు వేసుకున్నాడు. మొదటి రోజు ఆటలో చేసిన సెంచరీకి మరోటి చేర్చి దాన్ని డబుల్‌టన్‌గా మార్చాడు. దీంతో వన్డేలు టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన మూడో ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఫీట్ ఇంతకు ముందు సచిన్, సెహ్వాగ్ పేరిట ఉంది. డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ..ఈ టెస్ట్ సిరీస్‌లో 500 పరుగులు చేసిన రికార్డు నెలకొల్పాడు. ఇలా ఒకే టెస్ట్ సిరీస్‌లో 500 పరుగులు చేయడమో రికార్డు. అలానే వరసగా 150 పరుగులు పైబడిన స్కోరు సౌతాఫ్రికాపై ఇంతవరకూ ఏ ఆటగాడూ చేయలేదు.
సెంచరీని సిక్సర్‌తో సాధించిన రోహిత్ శర్మ డబుల్ సెంచరీని కూడా అలానే సిక్సర్‌తో పూర్తి చేశాడు. అలా ఒకే సిరీస్‌లో 16 సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇలా ఓ సిరీస్‌లో టీమిండియా తరపున సిక్సర్లు ఎక్కువగా కొట్టింది హర్భజన్ సింగ్. అతను 14 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ డబుల్‌టన్‌లో 28 ఫోర్లు..6 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ ఈ రేంజ్‌లో చెలరేగబట్టే టీమిండియా వరసగా వికెట్లు కోల్పోతున్నా భారీ స్కోర్ సాధించగలిగింది.
వైస్ కెప్టెన్ అజింక్య రహానే 115 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ వికెట్ కూడా పడిన తర్వాత ఇన్నింగ్స్‌ని రవీంద్ర జడేజా వృద్ధిమాన్ సాహా భారీ స్కోరుగా మలిచారు. జడేజా 51 పరుగులు..సాహా 24 రన్స్ చేశారు. చివర్లో వచ్చిన బౌలర్ ఉమేష్ యాదవ్ ఏకంగా 5 సిక్సర్లు బాదాడు .దీంతో ఓ వికెట్ ఉండగానే..కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్‌ని 497 రన్స్ దగ్గర డిక్లేర్ చేసాడు. టీమిండియా ఆలౌట్ కాకుండా ఉండటం ఇది వరసగా ఐదోసారి. దక్షిణాఫ్రికా బౌలర్లలో జార్జ్ లిండే నాలుగు, రబాడ మూడు వికెట్లు తీశారు.
Read More : డబుల్ సెంచరీతో సచిన్, సెహ్వాగ్‌ల సరసన రోహిత్ శర్మ