IPL 2025: అవును.. నా బౌలింగ్ స్పీడ్ తగ్గింది.. అయినప్పటికీ..: మయాంక్ యాదవ్
"అవన్నీ గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం కచ్చితంగా ఉంటుంది" అని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యువ సంచలనం మయాంక్ యాదవ్ గాయం నుంచి కోలుకుని దుమ్మురేపే రీఎంట్రీ ఇచ్చాడు. సుమారు ఆరు నెలల పాటు వెన్ను నొప్పితో ఆటకు దూరమైన ఈ యువ పేసర్ ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి బ్యాటర్ల కీలక వికెట్లు పడగొట్టి తానేంటో నిరూపించుకున్నాడు.
వేగం తగ్గిందా? విమర్శలపై మయాంక్ ఏమన్నాడు?
గాయం నుంచి తిరిగొచ్చిన తర్వాత తొలి మ్యాచ్‌లో మెరిసినా.. మయాంక్ వేగం కాస్త తగ్గిందని, ధారాళంగా పరుగులు ఇచ్చాడని విశ్లేషకుల నుంచి కామెంట్స్ వినిపించాయి. దీనిపై స్పందించిన మయాంక్ మాట్లాడుతూ.. “గాయం నుంచి కోలుకుని 5-6 నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాను. శరీరం తిరిగి మ్యాచ్‌కు తగ్గ ఫిట్‌నెస్ సాధించడానికి, అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. ఇది నాకు ఒక్కడికే కాదు.. అందిరికీ ఇదే జరుగుతుంది. నా బౌలింగ్ టెక్నిక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు” అని అన్నాడు.
ఐపీఎల్ వాయిదా పడకపోతే ఇవాళ లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరిగేది. ఈ నేపథ్యంలో మయాంక్ మాట్లాడుతూ.. “నా బౌలింగ్ వ్యూహంలో పెద్దగా మార్పులు ఉండవు. మునుపటిలాగే బౌలింగ్ చేయాలనుకుంటున్నాను. శరీరం ఇంకా పూర్తి స్థాయిలో సహకరించడం లేదు, ఇది అర్థం చేసుకోగలను. చాలా కాలం తర్వాత ఆడుతున్నందున, మునుపటి వేగాన్ని అందుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. నా ఆలోచనా విధానం, గేమ్ స్ట్రాటజీస్ మారలేదు. అయితే, బ్యాటర్లను, పిచ్ పరిస్థితులను మరింత వేగంగా అంచనా వేయాల్సిన అవసరం ఉంది” అని వివరించాడు.
గత ఏడాది ఆ సంచలనం గుర్తుందిగా?
గత ఏడాది (IPL 2024) సీజన్‌లో మయాంక్ యాదవ్ సృష్టించిన సంచలనాలు అంత తేలిగ్గా మరిచిపోలేం. 21 ఏళ్ల వయసులో ఏకంగా 156.7 కి.మీ వేగంతో బంతులను వేశాడు. అంతేగాక, ఆ టోర్నమెంట్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ప్రదర్శన అతనికి భారత జాతీయ జట్టులో స్థానం దక్కే అవకాశాలను కూడా మెరుగుపరిచింది.
LSG ప్లేఆఫ్ ఆశలు… మయాంక్ ధీమా
ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో కాస్త వెనుకబడింది. సీజన్ ఆరంభంలో ఆకట్టుకున్నా, మధ్యలో కొన్ని మ్యాచ్‌లలో తడబడింది. దీనిపై మయాంక్ మాట్లాడుతూ.. “కొన్ని మ్యాచ్‌లలో మేము పిచ్, గ్రౌండ్ పరిస్థితులను అంచనా వేయడంలో కాస్త ఆలస్యం చేశాం. ఆ పొరపాట్లు జరిగాయి. మాకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అవన్నీ గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం కచ్చితంగా ఉంటుంది” అని ఆశాభావం వ్యక్తం చేశాడు.
రిషబ్ పంత్ గురించి…
ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ప్రదర్శన గురించి మయాంక్ మాట్లాడుతూ “నాకు రిషబ్ భయ్యా చాలా సంవత్సరాలుగా తెలుసు. మేమిద్దరం ఢిల్లీలో ఒకే క్లబ్‌కు ఆడేవాళ్లం. ఇప్పటివరకు అతనితో మాట్లాడినప్పుడు ఒత్తిడి పోతుంది. అతను చాలా ధైర్యంగా ఆట గురించి, వ్యూహాల గురించి చర్చిస్తాడు” అని చెప్పాడు.