ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇప్పుడు అభిమానుల అందరి దృష్టి డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో టీమ్ఇండియా ఆడే తదుపరి సిరీస్ పై పడింది.
ఈ సైకిల్‌లో భారత్ తదుపరి స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు మ్యాచ్ అక్టోబర్ 2 నుంచి 6 వరకు నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుండగా రెండో టెస్టు మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి 14 వరకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరగనుంది. కాగా.. ఈ సిరీస్ కన్నా ముందు భారత జట్టు సెప్టెంబర్‌లో ఆసియా కప్‌లో పాల్గొననుంది.
Jasprit Bumrah : బుమ్రా ఇక నువ్వు టెస్టులకు రిటైర్‌మెంట్ ఇవొచ్చు.. ఆ ముగ్గురు ఉన్నారు?
శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ఇంగ్లాండ్‌లో రాణించిన జట్టులో ఉన్న ఆటగాళ్లలో కొందరికి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో చోటు దక్కకపోవచ్చు. ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం..
కరుణ్ నాయర్..
8 ఏళ్ల తరువాత భారత జట్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇంగ్లాండ్ పర్యటనలో నాలుగు మ్యాచ్‌లు ఆడి 21.83 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. కీలకమైన మూడో స్థానంలో పలు మ్యాచ్‌లో ఆడినప్పటికి కూడా అక్కడ కూడా రాణించలేకపోయాడు.
శార్దూల్ ఠాకూర్..
ఇంగ్లాండ్ పర్యటనకు అనూహ్యంగా శార్దూల్ ఠాకూర్ ఎంపిక అయ్యాడు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో 41 పరుగులు చేయడమే ఈ సిరీస్‌లో అతడు బ్యాటింగ్‌లో ఇచ్చిన ఏకైక సహకారం. విండీస్ టెస్టు సిరీస్ స్వదేశంలో జరుగుతుండడంతో కండిషన్స్ దృష్ట్యా కూడా అతడికి చోటు దక్కకపోవచ్చు.
Team India : నెలరోజులు టీమ్ఇండియా ఆటగాళ్లకు రెస్ట్.. ఎందుకో తెలుసా ?
అన్షుల్ కాంబోజ్..
ఆకాశ్ దీప్, అర్ష్ దీప్ సింగ్ గాయాల కారణంగా అనూహ్యంగా సిరీస్ మధ్యలో అన్షుల్ కాంబోజ్‌ను ఎంపిక చేశారు. ఈ హర్యానా పేసర్ నాలుగో టెస్టు మ్యాచ్‌లో అరంగ్రేటం చేసినప్పటికి పెద్దగా ఆకట్టుకోలేదు. ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ లు ఉండడంతో విండీస్‌తో సిరీస్‌లో ఇతడికి చోటు దక్కకపోవచ్చు.
జస్‌ప్రీత్ బుమ్రా..
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కేవలం మూడు మ్యాచ్‌లే ఆడాడు బుమ్రా. విండీస్‌తో సిరీస్ స్వదేశంలో జరుతుండడం, విండీస్‌తో సిరీస్ తరువాత పలు కీలక సిరీస్‌లు ఉండడంతో బుమ్రాకు విండీస్‌తో సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చు.
ఎస్ జగదీశన్..
రిషబ్ పంత్ గాయపడడంతో అతడి బ్యాకప్‌గా ఇంగ్లాండ్ పర్యటన మధ్యలో వచ్చాడు జగదీశన్. ఇతడికి విండీస్ సిరీస్‌లో చోటు దక్కడం అనుమానమే.
నితీశ్ కుమార్ రెడ్డి..
జిమ్ సెషన్‌లో గాయపడడంతో ఇంగ్లాండ్ పర్యటన మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు నితీశ్ కుమార్ రెడ్డి. అతడు కోలుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు విండీస్ పర్యటనకు కోలుకుంటాడా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Team India : ఒకే ఒక్క సిరీస్.. అటు కోహ్లీ, ఇటు రోహిత్ శర్మ వారసుడు దొరికేశాడు..!
రిషబ్ పంత్..
నాలుగో టెస్టు మ్యాచ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడుతూ గాయపడ్డాడు రిషబ్ పంత్. అతడి ఎడమ కాలి వేలు ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. వెస్టిండీస్ పర్యటనకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. అప్పటిలోగా అతడు కోలుకునే అవకాశం ఉంది. అయితే.. ఆ తరువాత కీలకమైన దక్షిణాఫ్రికాతో సిరీస్ ఉంది. ఈ క్రమంలో పంత్‌కు విండీస్‌తో సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వొచ్చు.