ఇంగ్లాండ్‌పై చారిత్రాత్మ‌క టెస్టు సిరీస్ విజ‌యం.. దోహ‌ద‌ప‌డిన అంశాలు ఇవే..

ఇంగ్లాండ్ పై చారిత్రాత్మ‌క టెస్టు సిరీస్ విజ‌యం దోహ‌ద‌ప‌డిన అంశాలు ఇవే..

IND vs ENG : టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, మ‌హ్మ‌ద్ ష‌మీల గైర్హ‌జ‌రీలో గాయంతో కేఎల్ రాహుల్‌, ర‌వీంద్ర జ‌డేజాలు దూరం అయినా కూడా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భార‌త్ 4-1తో కైవ‌సం చేసుకుంది. స్వ‌దేశంలోనే సిరీస్ జ‌రిగినా అత్యంత ప్ర‌తికూల ప్ర‌తిస్థితుల‌ను ఎదుర్కొంటూ మ్యాచ్‌ల‌ను గెలిచింది. ముఖ్యంగా తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయిన త‌రువాత టీమ్ఇండియా పుంజుకున్న విధానం అద్భుతం అనే చెప్పాలి. ఐదుగురు ఆట‌గాళ్లు ఈ సిరీస్ ద్వారా అరంగ్రేటం చేయ‌గా న‌లుగురు ఆట‌గాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాష్ దీప్,దేవదత్ పడిక్కల్ స‌త్తా చాటారు.

కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌లు మూల స్థంబాలుగా నిలిచి సిరీస్ విజ‌యంలో త‌మ వంతు పాత్ర‌ను పోషించారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, మ‌ణిక‌ట్టు స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌లు ఇంగ్లాండ్‌పై త‌మ ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తూ అత్యుత్త‌మ గ‌ణాంకాల‌ను న‌మోదు చేశారు. ఇక యువ‌కులు, అనుభ‌వ‌జ్ఞుల‌తో కూడిన జ‌ట్టును కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఎంతో చ‌క్క‌గా న‌డిపించాడు. కుర్రాళ్లు ఆడిన విధానం చూస్తుంటే సీనియ‌ర్లు రిటైర్ అయిన కూడా భార‌త క్రికెట్‌కు ఎలాంటి ఢోకా లేద‌నిపిస్తోంది.

స్వదేశంలో భారత్‌కు వరుసగా ఇది 17వ సిరీస్ విజయం కావ‌డం విశేషం. మ‌రే జ‌ట్టు కూడా వ‌రుస‌గా ఇన్ని సిరీస్‌లు గెల‌వ‌లేదు. “కొన్నిసార్లు మనం దానిని తేలికగా తీసుకుంటాం అని నేను అనుకుంటున్నాను. గత 10 సంవత్సరాలు లేదా ఒక దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా భారతదేశం ఈ ఆధిపత్యాన్ని కలిగి ఉంది. విజ‌య‌వంతంగా సిరీస్‌ల‌ను గెలుచుకుంటూ వ‌స్తోంది. ఎక్కువ టెస్టు మ్యాచ్‌ల‌ను ఓడిపోలేదు.” అని టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు.

Also Read: మ‌రీ అంత ఎందుకురా అయ్యా.. వికెట్లు నిన్ను ఏమ‌న్నాయ్ చెప్పు.. ఫ‌లితం అనుభ‌వించావుగా

ధ‌ర్మ‌శాల టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 64 పరుగులతో విజయం సాధించి, భారత్‌ 4-1తో సిరీస్‌ను గెలుచుకున్న అనంత‌రం ద్ర‌విడ్ మాట్లాడాడు. “ఇది భిన్నమైన ఫార్మాట్ అని నాకు తెలుసు. చాలా మంది ఇంగ్లీష్ ఆటగాళ్ళు లేదా ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు ఐపీఎల్ వ‌ల్ల ఇక్క‌డి ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న ఉంది. అయిన‌ప్ప‌టికీ రికార్డును కొన‌సాగించామంటే అందుకు మ‌న ఆట‌గాళ్ల అత్యుత్త‌మంగా రాణించ‌డంతోనే సాధ్య‌మైంది.” అని ద్ర‌విడ్ చెప్పాడు.

బాజ్‌బాల్ కాదు జైస్‌బాల్
టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ప‌రుగుల వ‌రద పారించాడు. 5 టెస్టుల్లో 712 ప‌రుగ‌లు చేశాడు. సునీల్ గ‌వాస్క‌ర్ త‌రువాత‌ ఓ టెస్టు సిరీస్‌లో 700 ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. వైజాగ్, రాజ్‌కోట్‌లలో అతడు బ్యాక్-టు-బ్యాక్ డబుల్ సెంచరీలు బాది జ‌ట్టు భారీ స్కోరు చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ముఖ్యంగా వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టులో భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 396 ప‌రుగులు చేయ‌గా అందులో జైస్వాల్ చేసిన ప‌రుగులు 209. జైస్వాల్ కాకుండా ఈ మ్యాచ్‌లో రెండో అత్య‌ధిక స్కోరు 34 కావ‌డం గ‌మ‌నార్హం.

ఒత్తిడిని అధిగ‌మిస్తూ.. స‌మ‌యానుకూలంగా త‌న బ్యాటింగ్‌లో మార్పులు చేసుకుంటూ ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై ఆధిప‌త్యం చెలాయించాడు. 26 సిక్స‌ర్ల‌తో సిరీస్‌ను ముగించాడు.

కుల్దీప్‌తో మ‌రింత పెరిగిన స్పిన్ బ‌లం..
స్వ‌దేశంలో ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజాల‌ను ఎదుర్కొన‌డం చాలా క‌ష్టం. ప్ర‌త్య‌ర్థులను వీళ్లు ముప్పు తిప్ప‌లు పెడ‌తారు. ఈ సారి కూడా అలాగే రాణించి అశ్విన్ 26, జ‌డేజా 19 వికెట్లు ప‌డ‌గొట్టి త‌మ వంతు పాత్ర పోషించాడు. వీరికి కుల్దీప్ యాద‌వ్ తోడు అయ్యాడు. చివ‌రి నాలుగు టెస్టుల్లో కుల్దీప్ త‌న కెరీర్‌లోనే అత్యుత్త‌మంగా బౌలింగ్ చేశాడు. బౌలింగ్‌లో వేరియేష‌న్లు నిల‌క‌డ‌గా లెంగ్త్‌లో వేస్తూ ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు.

ధర్మశాలలో అతని ప్రదర్శన జట్టు విజ‌యానికి మంచి స‌హ‌కారాన్ని అందించింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల రాణించి ఇంగ్లాండ్‌ను త‌క్కువ స్కోరుకే ప‌రిమితం చేశాడు. ఓ ద‌శ‌లో ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 100 పరుగులతో ప‌టిష్టంగా క‌నిపించ‌గా కుల్దీప్ కార‌ణంగా 218 పరుగులకు ఆలౌట్ అయింది.

అరంగేట్రం ఆట‌గాళ్లు అదుర్స్‌..
అందివచ్చిన అవ‌కాశాల‌ను కుర్రాళ్లు ఒడిసిప‌ట్టుకున్నారు. అరంగ్రేటం ఆట‌గాళ్లు వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ లు రాజ్‌కోట్‌లో మ్యాచ్‌లో రాణించారు. జురెల్ తొలి ఇన్నింగ్స్లో 46 ప‌రుగులు చేయ‌గా రెండో ఇన్నింగ్స్‌లో ఫామ్‌లో ఉన్న బెన్‌డ‌కెట్‌ను ర‌నౌట్ చేయ‌డం మ్యాచ్ ట‌ర్నింగ్ పాయింగ్‌గా చెప్ప‌వ‌చ్చు. ఇక రాంచీ టెస్టులో అయితే.. మిగిలిన ఆట‌గాళ్లు విఫ‌లం అయినా లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాటర్ల‌తో క‌లిసి 90 ప‌రుగులతో అత‌డు ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతోంది.

రాజ్‌కోట్ టెస్టులో అరంగ్రేటం చేసిన స‌ర్ఫ‌రాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ‌శ‌త‌కాలు చేశాడు. స్పిన్‌, పేస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నాడు. మిగిలిన మ్యాచుల్లోనూ రాణించాడు. పేసర్ ఆకాష్ దీప్ రాంచీలో మొదటి రోజు ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ భ‌ర‌తం ప‌ట్టాడు. జ‌స్‌ప్రీత్ బుమ్రాలేని లోటును తీరుస్తూ మూడు వికెట్లు తీశాడు. ఇక ధర్మశాలలో ఊహించని విధంగా అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్ 103 బంతుల్లో 65 పరుగులు పరుగుల‌తో రాణించారు.

Also Read : ఆర్‌సీబీ అభిమానుల‌కు షాక్‌.. బెంగ‌ళూరులో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధం ? కేఎస్‌సీఏ ప్ర‌త్యేక స‌మావేశం

వైజాగ్‌లో బుమ్రా మ్యాజిక్‌..
ఈ టెస్టు సిరీస్‌లో వైజాగ్‌లో బుమ్రా వేసిన స్పెల్ గురించి ఎంత చెప్పిన త‌క్కువే. భార‌త బౌల‌ర్ల అత్యుత్త‌మ స్పెల్‌ల‌లో ఇది ఒక‌టిగా నిలిచిపోతుంది. కేవ‌లం 25 ఓవర్లతో అత‌డు రివ‌ర్స్ స్వింగ్ రాబ‌ట్టి ఆరు వికెట్ల‌తో ఇంగ్లాండ్ ప‌త‌నాన్ని శాసించాడు. ముఖ్యంగా రివ‌ర్స్ స్వింగ్‌తో యార్క‌ర్ సంధించి ఒల్లీ పోప్ ను క్లీన్ బౌల్డ్ చేసిన బంతి.. బుమ్రా కెరీర్‌లోనే అత్యుత్త‌మ బంతి అని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి కాదేమో.

ట్రెండింగ్ వార్తలు