Tony de Nobrega Suffers Facial Injury after being hit by ball
క్రికెట్ ఆడేటప్పుడు ఆటగాళ్లకు గాయాలు అవ్వడం సహజం. కొన్ని సార్లు గాయం తీవ్రత సాధారణంగా ఉంటే మరికొన్ని సార్లు తీవ్రంగానూ ఉంటుంది. ఒక్కొసారి ప్రాణం కూడా పోవచ్చు. ఇందుకు ఫిల్ హ్యూస్ సంఘటనే ఉదాహరణ, బంతి తగలడంతో అతడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఆటగాళ్లకు మాత్రమే కాదు కొన్నిసార్లు అంపైర్లు గాయపడిన ఘటనలను చూశాం. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ అంఫైర్‌కు బంతి తగలడంతో ముఖం మారింది. ప్రస్తుతం ఆ అంఫైర్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆస్ట్రేలియాలో దేశవాలీ మ్యాచులకు టోనీ డి నోబ్రెగా అంపైర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
Yashasvi Jaiswal : తొలి ఆసీస్ పర్యటనపై యశస్వి జైస్వాల్.. గోల్డెన్ సలహా ఇచ్చిన కోహ్లీ..
గత శనివారం నార్త్ పెర్త్ – వెంబ్లే డిస్ట్రిక్ట్స్ మధ్య థర్డ్ గ్రేడ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అతడు అంఫైర్ గా తన బాధ్యతలను నిర్వర్తిస్తుండగా ఓ బ్యాటర్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి నేరుగా అంపైర్ టోనీ డి నోబ్రెగా వైపుగా వచ్చింది. దాని నుంచి అతడు తప్పించుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బాల్ నేరుగా అతడి ముఖాన్ని తాకింది. దీంతో కన్ను భాగంతో పాటు ముఖం మొత్తం వాచిపోయింది.
వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అదృష్ట వశాత్తు ఎలాంటి ఎముకలు విరగలేదని వైద్యులు చెప్పారు. శస్త్ర చికిత్స అవసరం లేదన్నారు. అతడు త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టాలని వెస్ట్ ఆస్ట్రేలియాన్ సబర్బన్ టర్ఫ్ క్రికెట్ అసోసియేషన్ అంపైర్స్ అసోసియేషన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.
కాగా.. అంపైర్ టోనీ డి నోబ్రెగా ఆస్పత్రిలో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంపైర్లకు సైతం హెల్మెట్లు ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు.