IPL: ఎమ్మెస్ ధోనీ నన్ను ఇలా ఔట్ చేయించాడు.. ఆశ్చర్యపోయాను: వెంకటేశ్ అయ్యర్
తాను అధిక సంఖ్యలో దేశవాలీ టోర్నీల్లో ఆడటం వల్ల ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నానని వెంకటేశ్ అయ్యర్ అన్నాడు.

ఐపీఎల్ మెగా వేలం 2025లో క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ రూ. 23.75 కోట్లు పలికిన విషయం తెలిసిందే. అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున వైస్ కెప్టెన్‌గా ఆడుతున్న ఈ స్టార్ ఆల్‌రౌండర్ అన్ని విభాగాల్లోనూ రాణిస్తాడని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అతి త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం అతడు సిద్ధమవుతున్నాడు.
ఐపీఎల్ 2023లో ఓ మ్యాచ్‌లో ఎమ్మెఎస్ ధోనీ తనను ఔట్ చేయడానికి వేసిన వ్యూహం గురించి వెంకటేశ్ అయ్యార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ధోనీ స్మార్ట్ ఫీల్డ్ ప్లేస్‌మెంట్ తనను ఎలా బోల్తా కొట్టించిందో వెంకటేశ్ అయ్యర్ వివరించాడు.
ధోనీ ఒక ఫీల్డర్‌ను డీప్ స్క్వేర్ లెగ్ నుంచి షార్ట్ థర్డ్ స్థానానికి మార్చాడని వెంకటేశ్ చెప్పాడు. ఆ తరువాతి బంతికే తాను ఒక షాట్ ఆడి ఔట్ అయ్యానని అన్నాడు. తాను బాదిన ఆ బంతి నేరుగా ఫీల్డర్‌కు చేతి వైపుగా వెళ్లిందని తెలిపాడు.
తాను ఇదే విషయంపై అప్పట్లో ధోనీని ప్రశ్నించానని, అదే ప్లేస్‌లో ఫీల్డర్‌ను ఎలా సెట్ చేశావని అడిగానని అన్నాడు. తన బ్యాటింగ్ స్టైల్ మీద ధోనీ అప్పటికే ఓ అంచనాకు వచ్చాడని, అది తనను బాగా ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపాడు.
తాను అనుకున్నట్లే షాట్ ఆడితే బాల్ ఆ ఫీల్డర్ చేతిలోకి వెళ్తుందని ధోనీ అన్నాడని చెప్పాడు. ధోనీ అంచనా వేసినట్లే తాను కొట్టిన బాల్ ఆ ఫీల్డర్ వద్దకే వెళ్లిందని అన్నాడు. కెమెరాల్లోనూ ఆ తర్వాత ఈ విషయాన్ని బాగా గమనించానని తెలిపాడు. బ్యాటింగ్ చేస్తున్న వారి మనసులో ఏముందో తెలుసుకోవడమే అసలైన సారథ్యమని చెప్పాడు.
తాను అధిక సంఖ్యలో దేశవాలీ టోర్నీల్లో ఆడటం వల్ల ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నానని వెంకటేశ్ అయ్యర్ అన్నాడు. తన జట్టులో అప్పటికే బాగా పరుగులు చేయగలిగే ఆటగాళ్లు ఉండడంతో తాను కొత్త పద్ధతిలో ఆడేతీరును నేర్చుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. దీంతో తన జట్టులోని ఇతర అధిక స్కోర్ చేసే క్రికెటర్లకు భిన్నంగా ఆడి, జట్టుకు ఉపయోగపడతానని అన్నాడు.