Mohit Sharma (Photo @IPL)
Mohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఆటగాడు మోహిత్ శర్మ(Mohit Sharma) ఒకడు. ఒకానొక సమయంలో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. రెండు ప్రపంచకప్(2014 టీ20, 2015 వన్డే)లలో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే 2020 ఐపీఎల్ సీజన్ తరువాత క్రికెట్‌కు పూర్తిగా దూరం అయ్యాడు. ఒక్కసారి జీవితం తల్లక్రిందులైంది. కష్టాలు, వరుస దెబ్బలు తగిలాయి. మరొకరు అయితే మళ్లీ జీవితంలో క్రికెట్ ఆడేవారు కాదు గానీ అక్కడ ఉంది మోహిత్ శర్మ,
వెన్నుగాయం వేధించినా, రెండేళ్లు ఐపీఎల్‌కు దూరం అయినా ఇవేవీ అతడికి అడ్డుకాలేదు. మధ్యలో అతడి తండ్రి మరణించాడు. ఆ సమయంలో కొంత కృంగిపోయినా తన ప్రయత్నాన్ని మాత్రం విరమించలేదు. క్రికెట్ వదిలి వేసి వేరే మార్గాన్ని చూసుకోవాలని ఎందరు చెప్పినా ఒప్పుకోలేదు. ఒకప్పుడు రూ.6 కోట్లకు అమ్ముడుపోయిన ఈ ఆటగాడు నెట్ బౌలర్‌గా మారాడు. ఏది ఏమైతేనేం ఆఖరికి అనుకున్నది సాధించాడు. ఆట పట్ల అతడి అంకితభావం, నిబద్దత ఎలాంటితో మోహిత్ చిన్న నాటి కోచ్ విజయ్ యాదవ్ ఓ ఆంగ్ల దినప్రతికతో ఇచ్చిన ఇంటర్ల్యూలో వెల్లడించాడు.
ఎన్నో బాధలు అయినా..
వెన్ను గాయం, షిన్ సమస్యలు, షిన్ ఫ్రాక్చర్, స్ట్రెస్ ఫ్రాక్చర్ కావచ్చు ఇలా ఎన్నో బాధలను మోహిత్ పడ్డాడు. ఆ సమయంలో అతడి స్థానంలో వేరొకరు ఉంటే ఖచ్చితంగా క్రికెట్ ను విడిచిపెట్టేవారు. అయితే ఆట పట్ల అతడికి ఉన్న నిబద్దత చాలా గొప్పది. అందుకనే అతడు అంటే నాకు చాలా ఇష్టం అని విజయ్ అన్నారు.
2019లో మోహిత్ శర్మ వెన్ను శస్త్రచికిత్స చేయించుకుని తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అతడి కష్టం చూసి నేను చలించిపోయాడు. అతడి వద్దకు వెళ్లి ఇక చాలు మోహిత్. క్రికెట్‌ను వదిలివేము. వేరే ఏదైనా చేయి అని అతడి సలహా ఇచ్చాను. అయితే మోహిత్ మాత్రం నా మాటలు వినలేదు. క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని అందుకు ఎంత కష్టానైనా భరిస్తానని మోహిత్ అన్నట్లు విజయ్ తెలిపాడు.
IPL Playoffs: 10లో 4 మిగిలాయ్.. ప్లే ఆఫ్స్ ఇలా.. ఐపీఎల్ విజేత ఎవరో..?
నెట్ బౌలర్‌గా
రెండేళ్ల(2021, 2022) పాటు మోహిత్ శర్మకు ఐపీఎల్ కాంట్రాక్టు దక్కలేదు. అయితే అతడు కృంగిపోలేదు. కొత్తగా ప్రారంభించాలని అనుకున్నాడు. 2022 సీజన్‌కు గుజరాత్ టైటాన్స్‌కు నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఆ జట్టు కోచ్ ఆశిష్ నెహ్రా సూచనలు, శిక్షణలో మరింత రాటు దేలాడు. నెట్ బౌలర్‌గా గుజరాత్ టైటాన్స్ జట్టులోని యువ, అనుభవజ్ఞులైన బ్యాటర్లకు అతడు బౌలింగ్ చేశాడు.
‘ఈ నిర్ణయం చాలా ధైర్యమైనది. గత సంవత్సరం, అతను నెట్ బౌలర్‌గా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ నిర్ణయం చాలా పెద్దది. ఎందుకంటే అతడు టీమ్ఇండియా తరుపున రెండు ప్రపంచకప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అలాంటి వాడు నెట్‌బౌలర్‌గా పని చేయడం అంత సులభం కాదు. అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇగో, ఫేమ్‌తో సహా చాలా విషయాలు ఇందులో ఇమిడి ఉంటాయి. అయితే మోహిత్ వాటిని పట్టించుకోలేదు. మరోసారి అందరికి తానేంటో నిరూపించుకోవాలని అనుకున్నాడు.’ అని యాదవ్ చెప్పాడు.
Virat Kohli: కోహ్లి మోకాలికి గాయం.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆర్‌సీబీ హెడ్ కోచ్ బంగర్
మళ్లీ ఐపీఎల్‌లో ఎంట్రీ
నెట్స్ లో పేస్, రిథమ్, ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ కారణంగా 34 ఏళ్ల మోహిత్ శర్మను గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2023 సీజన్‌కు రూ.50లక్షల బ్రేస్ ప్రైస్‌కు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో మొదటి మూడు మ్యాచుల్లో అతడికి అవకాశం రాలేదు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అతడికి అవకాశం రాగా.. నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి తానెంటో నిరూపించుకున్నాడు. ఇంకో మ్యాచ్‌లో లక్నో విజయానికి ఆఖరి ఓవర్‌లో 12 పరుగులు చేయాల్సి ఉండగా మోహిత్ పై ఉన్న నమ్మకంతో పాండ్యా అతడికి బౌలింగ్ ఇచ్చాడు. కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ 7 పరుగుల తేడాతో గుజరాత్‌కు నమ్మశక్యం కాని విజయాన్ని అందించాడు. మొత్తం మీద ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన మోహిత్ శర్మ 17 వికెట్లు తీశాడు.
‘నెట్ బౌలింగ్ మాత్రమే మైదానంలోకి రావడానికి అతనికి మిగిలి ఉన్న ఏకైక మార్గం. అతను దానిని స్టెప్ స్టోన్‌గా ఉపయోగించాడు. అతను నిజంగా కష్టపడ్డాడు. అతను తనను తాను నిరూపించుకున్నాడు. అందరినీ ఆకట్టుకున్నాడు. నెట్స్‌లో ఎక్కువ గంటలు నిలకడగా బౌలింగ్ చేసేవాడు. అందుకనే గుజరాత్ టైటాన్స్ అతడిని తీసుకుంది. ఆ అవకాశాన్ని రెండు చేతులతో అతడు ఒడిసి పట్టుకున్నాడు. తనలో ఇంకా క్రికెట్ ఉందని నిరూపించుకున్నాడు. విజయం సాధించేందుకు చాలా కష్టపడ్డాడు. క్రెడిట్ అంతా అతడికే దక్కుతుంది. ‘అని విజయ్ యాదవ్ తెలిపారు.