పాలిటిక్స్‌లోకి వినేశ్ ఫోగ‌ట్‌.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సోదరితో పోటీ?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ ఫోగ‌ట్‌ తన సోదరి బబితా ఫోగట్‌తో ముఖాముఖి పోటీపడే అవకాశం ఉందని ఫోగట్ కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

పాలిటిక్స్‌లోకి వినేశ్ ఫోగ‌ట్‌.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సోదరితో పోటీ?

Vinesh Phogat likely to contest in Haryana Assembly elections

Updated On : August 20, 2024 / 7:45 PM IST

Vinesh Phogat – Babita Phogat: పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని తిరిగొచ్చిన ఏస్ రెజ్లర్‌ వినేశ్ ఫోగ‌ట్‌పై రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు మంగళవారం IANSకి వెల్లడించాయి. తాను క్రియాశీల రాజకీయాల్లోకి రానని వినేశ్ ఫోగ‌ట్‌ గతంలోనే ప్రకటించారు. అయితే ఆమె మనసు మార్చేందుకు కొన్ని రాజకీయ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ ఫోగ‌ట్‌ తన సోదరి బబితా ఫోగట్‌తో ముఖాముఖి పోటీపడే అవకాశం ఉందని ఫోగట్ కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. వినేశ్ ఫోగ‌ట్‌ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగినప్పుడు.. “ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. హర్యానా అసెంబ్లీలో మీరు వినేశ్ ఫోగట్ వర్సెస్ బబితా ఫోగట్.. బజరంగ్ పునియా వర్సెస్ యోగేశ్వర్ దత్‌ పోటీ చూసే అవకాశం ఉంది. వినేశ్ ఫోగట్‌ను ఒప్పించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయ”ని ఫోగట్ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Also Read: వినేశ్ ఫోగ‌ట్‌కు రూ. 16 కోట్లు.. ఎలాంటి డబ్బు తీసుకోలేదన్న సోమ్‌వీర్‌

కాగా, పారిస్ నుంచి శనివారం ఢిల్లీకి తిరిగొచ్చిన వినేశ్ ఫోగట్‌ను ఘన స్వాగతం లభించింది. ఆమెకు మద్దతుగా పెద్దఎత్తున క్రీడాకారులు, పంచాయతీ పెద్దలు, క్రీడాభిమానులు ఢిల్లీ విమానాశ్రయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వినేశ్ ఫోగట్‌ మాట్లాడుతూ.. తమ పోరాటం ఇంకా ముగియలేదని.. నిజం గెలవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.