Virat Kohli and Rohit Sharma Told To Play Domestic Cricket By BCCI
BCCI : టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తు పై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీరిద్దరు వన్డే ప్రపంచకప్ 2027 ఆడతారా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలో జాతీయ జట్టులో ఎంపిక కోసం పరిగణలోకి తీసుకోవాలంటే దేశీయ క్రికెట్ తప్పనిసరిగా ఆడాలని ఇప్పటికే వీరిద్దరికి బీసీసీఐ (bcci)స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు తాను అందుబాటులో ఉంటానని ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు రోహిత్ స్పష్టం చేశాడు. అయితే.. దేశీయ క్రికెట్ ఆడే విషయంలో కోహ్లీ ఇంకా తన నిర్ణయాన్ని తెలియజేయలేదు. టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన రో-కో ద్వయం ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. ప్రస్తుతం అతడు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. ముంబైలోని శరద్ పవార్ ఇండోర్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ సత్తా చాటాలని భావిస్తున్నాడు.
ప్రస్తుతం కోహ్లీ లండన్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ నెలాఖరును దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం అతడు భారత్‌కు రానున్నాడు. డిసెంబర్ 24 నుంచి విజయ్ హాజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. హిట్‌మ్యాన్ చివరిసారి 2018లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు.
ధక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే – నవంబర్ 30న – రాంచీలో
* రెండో వన్డే – డిసెంబర్ 3న – రాయ్‌పూర్
* మూడో వన్డే – డిసెంబర్ 6న – విశాఖపట్నం