IND vs SA : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. టీమ్ఇండియా ఆటగాళ్లు గిల్, జడేజా, రాహుల్, బుమ్రాలను ఊరిస్తున్న రికార్డులు ఇవే..
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు (IND vs SA) ముందు శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, బుమ్రా లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
IND vs SA test series Gill Rahul Jadeja and Bumrah may achieve these milestones
IND vs SA : ఫ్రీడమ్ ట్రోఫీలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో తొలి టెస్టు మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 14 నుంచి 18 వరకు జరగనుంది. ఇక నవంబర్ 22 నుంచి 26 వరకు జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్‌కు (IND vs SA) ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రాలను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
శుభ్‌మన్ గిల్..
2020లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 39 టెస్టులు ఆడాడు. 43 సగటుతో 2839 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో గిల్ 161 పరుగులు సాధిస్తే.. సుదీర్ఘ ఫార్మాట్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
కేఎల్ రాహుల్..
2014లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు కేఎల్ రాహుల్. ఇప్పటి వరకు 65 టెస్టులు ఆడాడు. 36.6 సగటుతో 3985 పరుగులు సాధించాడు. ఇందులో 11 శతకాలు, 20 అర్థశతకాలు ఉన్నాయి. దక్షిణాప్రికాతో టెస్టు సిరీస్‌లో రాహుల్ 15 పరుగులు సాధిస్తే.. సుదీర్ఘ ఫార్మాట్‌లో నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
రవీంద్ర జడేజా..
2012లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన రవీంద్ర జడేజా ఇప్పటి వరకు 87 మ్యాచ్‌లు ఆడాడు. 38.7 సగటుతో 3990 పరుగులు సాధించాడు. ఇందులో 6 శతకాలు, 27 అర్థశతకాలు ఉన్నాయి. ఇక సఫారీలతో సిరీస్‌లో 10 పరుగులు చేస్తే టెస్టుల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
అదే విధంగా బౌలింగ్‌లో ఇప్పటి వరకు జడ్డూ.. 338 వికెట్లు తీశాడు. సఫారీతో సిరీస్‌లో 12 వికెట్లు సాధిస్తే.. టెస్టుల్లో 350 వికెట్ల క్లబ్‌లో చేరుకుంటాడు.
జస్‌ప్రీత్ బుమ్రా..
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా 2018లో టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 50 టెస్టులు ఆడాడు. 226 వికెట్లు పడగొట్టాడు. సఫారీతో సిరీస్‌లో నాలుగు వికెట్లు తీస్తే.. అతడు టెస్టుల్లో మహ్మద్ షమీ (229)ని అధిగమిస్తాడు. అదే సమయంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో 11వ స్థానానికి చేరుకుంటాడు.
