Virat Kohli returns after 12 years to Ranji Trophy fan breaches security to touch star batters feet
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీసీసీఐ విధించిన ఓ నిబంధన కారణంగా స్టార్ ఆటగాళ్లంతా రంజీట్రోఫీ బాట పట్టారు. ఈ క్రమంలో 12 ఏళ్ల తరువాత కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా.. అతడిని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు స్టేడియానికి పోటెత్తారు.
గురువారం ఢిల్లీ, సౌరాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత సౌరాష్ట్ర బ్యాటింగ్‌కు దిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికైంది. ప్రేక్షకులు మ్యాచ్ ను ఉచితంగా చూసేందుకు ఢిల్లీ క్రికెట్ సంఘం అవకాశం కల్పించింది. దీంతో స్టార్ ఆటగాడు కోహ్లీని చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. కోహ్లీ, ఆర్‌సీబీ నామస్మరణంతో స్టేడియం దద్దరిల్లిపోతుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఈ స్థాయిలో ప్రేక్షకులు హాజరు కావడం ఇదే తొలిసారి అని కామెంటేటర్లు చెబుతున్నారు.
Cricket Viral Video : ప్రపంచంలోనే అన్‌లక్కీ బ్యాటర్.. ఇలా రనౌట్ అవుతాడని ఊహించి ఉండడు సుమీ..!
A fan entered the ground to meet Virat Kohli & he touched Kohli’s feet. 🥹❤️ pic.twitter.com/97SyZleaNv
— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 30, 2025
మైదానంలోకి దూసుకువచ్చిన అభిమాని..
ఇదిలా ఉంటే.. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకువెళ్లాడు. నేరుగా విరాట్ కోహ్లీ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అతడి కాళ్లపై పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకుని సదరు అభిమానిని మైదానం బయటకు తీసుకువెళ్లారు. ఈ ఘటనతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది.
ఇక ఈ మ్యాచ్‌ను జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లు ముగిసే సరికి 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఉపేంద్ర యాదవ్ (27), కర్ణ్ శర్మ (2) లు క్రీజులో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో సిద్దాంత్ శర్మ, మోనీ గ్రేవాల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. నవదీప్ సైనీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా.. సౌరాష్ట్ర త్వరగా ఆలౌట్ కావాలని, కోహ్లీ బ్యాటింగ్‌కు తొందరగా రావాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.
మరో వైపు విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 9 ఇన్నింగ్స్‌ల్లో 23.75 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో రంజీలో ఫామ్ అందుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సాయం తీసుకున్నాడు. అతడి ఆధ్వర్యంలో ప్రత్యేక సాధన చేశాడు.