తన సొంత బ్రాండ్‌ వన్‌8ను అజిలిటాస్‌కు అమ్మేస్తున్న విరాట్‌ కోహ్లీ.. ఇకపై ఏం చేస్తాడంటే?

ఆ పోస్ట్ ద్వారా అతడు అజిలిటాస్‌తో ఒప్పందం చేసుకున్నాడని స్పష్టమైంది.

తన సొంత బ్రాండ్‌ వన్‌8ను అజిలిటాస్‌కు అమ్మేస్తున్న విరాట్‌ కోహ్లీ.. ఇకపై ఏం చేస్తాడంటే?

Updated On : December 9, 2025 / 8:52 PM IST

Virat Kohli: టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ తన స్పోర్టింగ్ బ్రాండ్ వన్8ను అజిలిటాస్ కంపెనీకి విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. అజిలిటాస్ కంపెనీ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్టార్టప్. ఇందులో మైనారిటీ షేర్ హోల్డర్ అవ్వడానికి కోహ్లీ వ్యక్తిగతంగా రూ.40 కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు.

అజిలిటాస్‌కు వన్8 రెండో అక్విజిషన్. గత ఏడాది మోచికో షూస్‌ కంపెనీని అజిలిటాస్‌ కొనుగోలు చేసింది. అడిడాస్, ప్యూమా, న్యూ బ్యాలన్స్, స్కెచర్స్, రీబాక్, ఆసిక్స్, క్రోక్స్, డెకాథ్లాన్, క్లార్క్స్, యుఎస్ పోలో వంటి బ్రాండ్స్‌కు మోచికో షూస్ కంపెనీ షూస్ తయారు చేస్తుంది.

విరాట్ కోహ్లీ-అజిలిటాస్ ఒప్పంద వివరాలు ఇవే..
ఒప్పందం ప్రకారం కోహ్లీ వన్8ను అజిలిటాస్‌కు విక్రయిస్తాడు. అలాగే, అజిలిటాస్‌ కంపెనీలో రూ.40 కోట్ల పెట్టుబడి పెడతాడు. “పూర్తి ఒప్పందం విరాట్‌ను అజిలిటాస్‌లో మైనారిటీ షేర్ హోల్డర్‌గా చేస్తుంది” అని అజిలిటాస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అభిషేక్ గంగూలీ తెలిపారు.

కోహ్లీ-అజిలిటాస్ మధ్య ఒప్పందం ఎక్స్‌క్లూజివ్‌. అంటే కోహ్లీ ఇతర ఏ స్పోర్ట్స్ బ్రాండ్‌ను ఎండోర్స్ చేయలేడు. ఇతర వివరాలను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కోహ్లీ షేర్ “మిడ్ సింగిల్ డిజిట్స్” పరిధిలో ఉంటుందని గంగూలీ చెప్పారు.
“మిడ్ సింగిల్ డిజిట్స్” అంటే 3 నుంచి 7 శాతం మధ్యలో ఉండే వాటాను సూచించే పదం.

కోహ్లీ వన్8ను మొదట ప్యూమాలో భాగంగా ఉంచాడు. ప్యూమాతో అతడి ఏడేళ్ల కాంట్రాక్ట్ కొన్ని నెలల క్రితమే ముగిసింది. ప్యూమా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా గంగూలీ ఉన్న సమయంలో కోహ్లీని బ్రాండ్ అంబాసడర్ గా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. 2017లో మొదలైన రూ.110 కోట్ల విలువైన కాంట్రాక్ట్ 2025 వరకు అమల్లో ఉంది.

“నేను వన్8లో భాగంగా ఉండొచ్చు లేదా అజిలిటాస్‌లో భాగంగా ఉండొచ్చు” అని కోహ్లీ సోషల్ మీడియా పోస్ట్‌లో చెప్పాడు. ఆ పోస్ట్ ద్వారా అతడు అజిలిటాస్‌తో ఒప్పందం చేసుకున్నాడని స్పష్టమైంది.