ఆదరణ దొరికితే ఆణిముత్యం : ఆంధ్ర మేరికోమ్ ఈ అరుణ

  • Published By: chvmurthy ,Published On : February 4, 2019 / 12:34 PM IST
ఆదరణ దొరికితే ఆణిముత్యం : ఆంధ్ర మేరికోమ్ ఈ అరుణ

Updated On : February 4, 2019 / 12:34 PM IST

విశాఖపట్నం: ఆ యువతి బాక్సింగ్ రింగ్ లోకి వెళ్ళింది అంటే పతకం గ్యారెంటీ.. చిన్న వయసులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ప్రోత్సహిస్తే దేశానికే వన్నె తేగలదు. అయినా ప్రోత్సాహం కరువయ్యింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. ఎంచుకున్న రంగంలో రాణిస్తే రికార్డులు నెలకొల్పుతాననే ధీమాగా చెబుతోంది బాక్సింగ్ క్రీడాకారిణి అరుణ. స్పాన్సర్స్ ముందుకొస్తే.. ఆంధ్ర మేరికోమ్ గా గుర్తింపు తెస్తానంటోంది అరుణ.

 

విశాఖపట్నం పట్టణం 48వ వార్డు ఆర్.కె.పురం ప్రాంతానికి చెందిన కోరుకొండ పైడిరాజు, మణి దంపతుల కుమార్తె అరుణ. ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. అనారోగ్యంతో ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. తల్లి ఇళ్లల్లో పని చేస్తుంది. 2016లో గుంటూరులో జరిగిన NTR మెమోరియల్ బాక్సింగ్ జిల్లా స్థాయి పోటీల్లో 50 కేజీల విభాగంలో రజత పతకాన్ని సాధించింది. కొల్ కతాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం సాధించింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నది. 2017లో అంతర్జాతీయ బాక్సింగ్  పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది.

బాక్సింగ్ లో ఆమె కనపరిచిన ప్రతిభకు మెచ్చి డిసెంబర్ 2017 లో JNTU కాకినాడ కీర్తి పురస్కారాన్ని అందజేసింది. ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న అరుణ  ప్రస్తుతం బాక్సింగ్ ను వదిలేద్దామనే అలోచనలో ఉంది. బాక్సింగ్ లో రాణించాలంటే పౌష్టికాహారంతో పాటు అవసరమైన శిక్షణ అవసరం. ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నానని అరుణ ఆవేదన వ్యక్తం చేస్తుంది. స్పాన్సర్స్ దొరికితే.. ఎవరైనా ప్రోత్సాహమిస్తే అంతర్జాతీయ స్ధాయిలో మెడల్స్ సాధిస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది ఈ ఆంధ్రా మేరికోమ్ తో 10TV స్పెషల్ డిస్కషన్ చూద్దాం…