టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టులతో పాటు టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. అయితే.. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసి సిరీస్‌ను 2-2తో సమం చేశారు. ఇంగ్లాండ్ గడ్డ పై కుర్రాళ్లు రాణించడంతో వన్డేల్లో సీనియర్లు కొనసాగడం పై ప్రభావం చూపుతుందని పలువురు క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
టీమ్ఇండియా టెస్టు పగ్గాలు అందుకున్న తొలి సిరీస్‌లోనే గిల్ రాణించడంతో ఇక వన్డే పగ్గాలు కూడా అతడికే అందించాలనే డిమాండ్లు మొదలు అయ్యాయి. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 38 ఏళ్లు.. 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి అతడి వయసు 40కి చేరుకుంటుంది. అప్పటి వరకు అతడు ఫిట్‌గా ఉంటాడా? అన్న సందేహాలు మొదలు అయ్యాయి. ఈ క్రమంలోనే ఆసీస్‌తో సిరీస్ సమయానికన్నా ముందే గిల్‌కు వన్డే బాధ్యతలను అప్పగించాలని.. అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా ప్రపంచకప్ బరిలోకి దిగాలని అంటున్నారు.
Lords : పాపం నక్క బావా.. క్రికెట్ ఆడాలని వచ్చిందో.. పరుగు పందెం అని అనుకుందో.. వీడియో వైరల్..
అటు కోహ్లీ ప్రస్తుత వయసు 36 ఏళ్లు కాగా.. 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి 38 ఏళ్లకు చేరుకుంటాడు. దీంతో రోకో ద్వయం కేవలం వన్డేలు, ఐపీఎల్ మాత్రమే ఆడుతూ అప్పటి వరకు ఫామ్ ను కొనసాగించగలరా అన్న ప్రశ్నలు మొదలు అయ్యాయి. మరోవైపు.. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను వన్డే జట్టులో కొనసాగేందుకు హెడ్ కోచ్ గంభీర్ అంగీకరిస్తాడా? అన్నది చూడాల్సిందే. వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యం జట్టును సిద్ధం చేయాలని గంభీర్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇదే విషయం పై సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో బీసీసీఐ మాట్లాడాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఆసీస్‌తో సిరీస్ నుంచి టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకాలు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్ కన్నా ముందే రోకో ద్వయంతో బీసీసీఐ అధికారులు మాట్లాడనున్నారు. ఆ తరువాతే వీరిపై ఓ నిర్ణయానికి రానున్నారు అని బోర్డు వర్గాలు తెలిపినట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వారిని తప్పుకోమని మాత్రం బీసీసీఐ చెప్పదని అంటున్నారు.
Team India : బుమ్రా నుంచి నాయర్ వరకు.. విండీస్‌తో సిరీస్‌కు ఈ ఏడుగురు ఆటగాళ్లకు చోటు కష్టమే?
ఈ ఏడాది అక్టోబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్కడ ఆతిథ్య ఆసీస్‌తో భారత్ మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.