PIC: @BCCI/IPL
ఐపీఎల్ 2025 సీజన్‌లో పేలవ ప్రదర్శన ఇస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టు ముంబై ఇండియన్స్‌తో ఏప్రిల్ 20న తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గాయపడిన గుజర్ప్రీత్ సింగ్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌ను తమ జట్టులోకి తీసుకుంది. దీనికోసం CSK బ్రెవిస్‌కు రూ.2.2 కోట్లు చెల్లించింది.
గతంలో ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్ లో ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట్లోనే విజయం సాధించింది. అలాగే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. అంతేగాక, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా మోచేతి గాయంతో టోర్నీకి దూరం కావడంతో మరిన్ని కష్టాల్లో పడింది.
డెవాల్డ్ బ్రెవిస్‌ని “బేబీ ఏబీ” అని ఎందుకంటారు?
దక్షిణాఫ్రికాకు చెందిన బ్రెవిస్ ఆటతీరు లెజెండ్ ఏబీ డివిలియర్స్‌ను పోలి ఉంటుంది. దీంతో అతడిని “బేబీ ఎబీ” అని ముద్దుగా పిలుచుకుంటారు. 2022 అండర్-19 ప్రపంచకప్‌లో తన విధ్వంసకర ఆటతీరు ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆ టోర్నీలో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 506 పరుగులు చేసి, శిఖర్ ధావన్ సింగిల్ ఎడిషన్ రన్ రికార్డును తిరగరాశాడు. అందులో రెండు శతకాలు, రెండు సార్లు 90కి పైగా స్కోరు చేయడం విశేషం. అదే టోర్నీలో బౌలింగ్ లో కూడానా రాణించి ఏడు వికెట్లు పడగొట్టాడు.
Also Read: ఇందులో బౌలర్ చేసింది ఏముంది? అతడికి ఎందుకు శిక్ష?: వరుణ్ చక్రవర్తి
ఆ టోర్నీ ముగిసిన కొద్ది రోజుల్లోనే ముంబై ఇండియన్స్ బ్రెవిస్ ను భారీగా రూ.3 కోట్లు వెచ్చించి తీసుకుంది. అప్పట్లో CSKతో జరిగిన మ్యాచ్ లో MI విజయం సాధించింది. మూడు సీజన్ల పాటు MI జట్టులో కొనసాగిన బ్రెవిస్.. 2022లో ఏడు, 2024లో మూడు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 230 పరుగులు చేసినా, వాటిల్లో హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు.
లెగ్ స్పిన్నర్‌గా తొలి బంతికే వికెట్ తీసిన అరుదైన 14 మంది ఆటగాళ్లలో బ్రెవిస్ ఒకడు. ఐపీఎల్ లో మొదటి వికెట్ గా 2022లో పుణే వేదికగా విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి చెందిన మిగతా లీగ్‌లైన MI కేప్ టౌన్ (SA20), MI న్యూయార్క్ (MLC) తరఫున కూడా బ్రెవిస్ ప్రాతినిధ్యం వహించాడు. ఆయా లీగ్‌ల్లోని 2025, 2023 టైటిల్స్‌ను గెలిపించడంలో ప్రముఖపాత్ర పోషించి తాను ఏంటో నిరూపించుకున్నాడు.
ఇటీవలి SA20 సీజన్‌లో బ్రెవిస్ మళ్లీ మెరిశాడు. 12 మ్యాచ్‌ల్లో 291 పరుగులతో పాటు 25 సిక్సర్లు కొట్టి అత్యధిక స్ట్రైక్‌రేట్ (184.25) నమోదు చేసుకున్నాడు. ఇప్పటివరకు 81 T20 మ్యాచ్ ల్లో 1,787 పరుగులు చేసి, సగటుగా 26.27, స్ట్రైక్‌రేట్ 144.93తో నిలిచాడు. అదనంగా 18 వికెట్లు కూడా తీసుకున్నాడు.
అయినప్పటికీ, దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో నిలదొక్కుకునే అవకాశాన్ని ఇంకా అందుకోలేకపోయాడు. ఇప్పటి వరకు కేవలం రెండు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడి, వాటిలో ఐదు పరుగులకే పరిమితమయ్యాడు.