ఇతడు కాకుండా మరో ప్లేయర్‌ ఇలాచేస్తే ఐపీఎల్‌ 2025 నుంచి తీసేసేవారు: పుజారా షాకింగ్ కామెంట్స్‌

టీంలో స్థానం దక్కి, ఆడే అవకాశం లభించినప్పుడు, దాని విలువ తెలుసుకోవాలని పుజారా అన్నాడు.

ఇతడు కాకుండా మరో ప్లేయర్‌ ఇలాచేస్తే ఐపీఎల్‌ 2025 నుంచి తీసేసేవారు: పుజారా షాకింగ్ కామెంట్స్‌

Pic: @IPL

Updated On : April 18, 2025 / 8:30 PM IST

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్న స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఫామ్ విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మ్యాక్స్‌వెల్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం 41 పరుగులే చేశాడు. బ్యాటింగ్ సగటు 8.20 కాగా, స్ట్రైక్ రేట్ 100 ఉంది.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌ తీరుపై భారత మాజీ క్రికెటర్‌ ఛెతేశ్వర్‌ పుజారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మ్యాక్స్‌వెల్ ఆటతీరులో ఎలాంటి మార్పు లేదని, జట్టులో స్థానం కోల్పోకముందే జాగ్రత్త పడాలని హెచ్చరించాడు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో ఆడే విధానం చాలా యూనిక్ గా ఉంటోందని, కొన్నిసార్లు అతని ఆటతీరు చూస్తే మ్యాచ్‌ను అంత సీరియస్‌గా తీసుకోవడంలేదేమో అనిపిస్తుందని పుజారా అన్నాడు. స్టార్ ప్లేయర్ గా తన ఆటను మరింత సీరియస్‌గా తీసుకుని, జట్టు కోసం మరింతగా కృషి చేయాలని పుజారా చెప్పాడు. టీంలో స్థానం దక్కి, ఆడే అవకాశం లభించినప్పుడు, దాని విలువ తెలుసుకోవాలని పుజారా అన్నాడు.

“అంతేగాక ఒక ఆటగాడు ఫామ్ లో లేనప్పుడు, అతను రెండు రకాలుగా ఉండవచ్చు. ఒకటి కాజువల్ గా, అంటే అంత సీరియస్‌గా తీసుకోకుండా ఆడటం. రెండవది.. తన ఆటను మెరుగుపరచుకోవడానికి, జట్టు కోసం విజయాలు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించడం. ఈ రెండింటి మధ్య ఫైన్ లైన్ ఉంటుంది. ఆటగాడు ఏ వైపు ఉంటాడనేది చాలా ముఖ్యం. ఇతని స్థానములో మరెవరో అయితే ఎప్పుడో జట్టులో నుంచి తప్పించేవాళ్లే. కానీ మ్యాక్స్‌వెల్ కాబట్టి అవకాశం ఇస్తున్నారు” అని పుజారా అన్నాడు.

సంజయ్ బంగర్ స్పందన
గతంలో పంజాబ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్ కూడా మ్యాక్స్‌వెల్ ఆట తీరుపై మాట్లాడారు. RCBలో ఉన్నప్పుడు అతని చుట్టూ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ లాంటి స్టార్ బ్యాట్స్‌మన్‌లు ఉండటంతో అతనిపై ఒత్తిడి తక్కువగా ఉండేదని చెప్పారు.

“మ్యాక్స్‌వెల్ ఎలా ఆడతాడో అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. RCBలో ఉన్న సమయంలో అతనిపట్ల అంచనాలు తక్కువగా ఉండేవి. విరాట్, ఫాఫ్ వంటి వారు కీలక ప్లేయర్ లుగా ఉండటంతో అతనిపై దృష్టి అంతగా ఉండేది కాదు. కానీ ఇప్పడు పంజాబ్‌లో మ్యాక్స్‌వెల్ ప్రధాన బ్యాట్స్‌మన్‌.. బాధ్యత ఉంది” అని బంగర్ వివరించారు.

మొత్తం మీద, మ్యాక్స్‌వెల్ ఆటతీరుపై ఇప్పుడు ఆటగాళ్ల నుంచే కాదు, అభిమానుల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే మ్యాచ్‌ల్లో అయినా మ్యాక్స్‌వెల్ తన ఫామ్‌ను తిరిగి పొందుతాడా? అన్నది ఆసక్తికరంగా మారుతోంది.