Rohit Sharma Retirement
Rohit Sharma Retirement: టెస్టులకు గుడ్ బై చెప్పాలన్న రోహిత్ శర్మ నిర్ణయం అభిమానులకు కచ్చితంగా షాకే. వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో మొదలయ్యే ప్రతిష్టాత్మక ఐదు టెస్టుల సిరీస్ లో అతనే జట్టును నడిపిస్తాడని అంతా భావించారు. కొన్నిరోజుల ముందే ఈ పర్యటనకోసం బీసీసీఐ సన్నాహాలు మొదలు పెట్టింది. సెలెక్టర్ల లిస్ట్ లో రోహిత్ శర్మ పేరుకూడా ఉంది. దీంతో అతనే కెప్టెన్ అని కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో టెస్టు క్రికెట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ వర్గాలను షాకింగ్ కు గురిచేసింది.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటన తరువాత ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లే టీమిండియాకు ఎవరు సారథ్య బాధ్యతలు వహిస్తారు..? బీసీసీఐ ఎవరికి పగ్గాలు అప్పగిస్తుందనే అంశం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ జాబితాలో ప్రముఖంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. టీమిండియా వర్గాల సమాచారం ప్రకారం చూస్తే… జస్ర్పీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ పేర్లు బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
గత ఐదు నెలల క్రితం టీమిండియా జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడింది. ఆ టూర్ లో రోహిత్ శర్మ గైర్హాజరీలో రెండు మ్యాచ్ లకు బుమ్రా నాయకత్వ బాధ్యతలు వహించాడు. బుమ్రా కెప్టెన్సీలో తొలి టెస్టులో భారత్ జట్టు విజయం సాధించింది. ఆ సిరీస్ లో తరువాత మ్యాచ్ లకు బుమ్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే, బుమ్రా ఫిట్ నెస్ సమస్య దృష్ట్యా వరుసగా మ్యాచ్ లు ఆడటం కష్టమన్న ఉద్దేశంతో అతన్ని నాయకత్వ బాధ్యతల నుంచి దూరంగా ఉంచాలన్న భావనలో సెలక్టర్లు ఉన్నట్లు సమాచారం.
రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ పేర్లు టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు టీమిండియా వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే, రిషబ్ పంత్ బ్యాటింగ్ లో నిలకడ లేమి కారణంగా అతనికి అదనపు బాధ్యతలు అప్పగించే విషయంలో సెలక్టర్లు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. శుభ్ మన్ గిల్ ను కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. గిల్ ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను చక్కగా నడిపిస్తున్నాడు. అదే సమయంలో బ్యాటింగ్ లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే, గిల్ వయస్సు 25ఏళ్లు కావడంతో భవిష్యత్ దిశగా కూడా అతన్ని సారథిగా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేఎల్ రాహుల్ సీనియర్ ప్లేయర్. బ్యాటింగ్ లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ పేరును కూడా సెలక్టర్లు కెప్టెన్సీ బాధ్యతలకు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Also Read: MI vs GT : గుజరాత్ చేతిలో ఓటమి.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ బిగ్ షాక్..
మరోవైపు.. ఇంగ్లాండ్ టూర్ వరకు విరాట్ కోహ్లీ టెస్టు జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేకపోలేదు. 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెప్టెన్సీని వదులుకున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ దేశంలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్, 68 మ్యాచ్‌లలో 40 మ్యాచ్‌ల్లో జట్టును విజయపథంలో నడిపించాడు. అందువల్ల, ఇంగ్లాండ్ టూర్ కు కోహ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ పర్యటన ప్రాముఖ్యత దృష్ట్యా అక్కడి పరిస్థితులపై గతంలో నాయకత్వం వహించిన వ్యక్తికి సెలెక్టర్లు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయిస్తే కోహ్లీనే ప్రత్యమ్నాయంగా నిలిచే అవకాశం ఉంది. మొత్తానికి వీరి ఐదుగురిలో ఎవరు భారత జట్టు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకుంటారన్న అంశం ఆసక్తికరంగా మారింది.