Womens World Cup 2022 : వరల్డ్‌కప్ నుంచి భారత్ నిష్క్రమణ, ఆఖరి బంతికి సౌతాఫ్రికా గెలుపు

కల చెదిరింది. పోరాటం ముగిసింది. భారత జట్టు ఇంటి ముఖం పట్టింది. ఐసీసీ Womens World Cup 2022 నుంచి భారత జట్టు నిష్క్రమించింది.

Womens World Cup 2022 : కల చెదిరింది. పోరాటం ముగిసింది. భారత జట్టు ఇంటి ముఖం పట్టింది. న్యూజిలాండ్ లో జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2022 నుంచి భారత జట్టు నిష్క్రమించింది. సెమీస్ బెర్త్ కోసం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో చివరి బంతి వరకు పోరాడిన భారత్ కు నిరాశే మిగిలింది. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు కావాల్సి ఉండగా.. టీమిండియా బౌలర్ దీప్తి శర్మ చేసిన చిన్న పొరపాటు మ్యాచ్ ను కోల్పోయేలా చేసింది. ఆ విధంగా టీమిండియా వరల్డ్ కప్ ఆశలు ముగిశాయి.

దీప్తి శర్మ వేసిన బంతిని సౌతాఫ్రికా బ్యాటర్ డుప్రీజ్ లాంగాన్ దిశగా కొట్టగా, అక్కడ హర్మన్ ప్రీత్ కౌర్ క్యాచ్ పట్టింది. దాంతో భారత శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. కానీ అది నోబాల్ అని అంపైర్ ప్రకటించడంతో, దక్షిణాఫ్రికా జట్టుకు పరుగు రావడంతో పాటు ఫ్రీ హిట్ కూడా లభించింది. ఇక చివరి బంతికి 1 పరుగు అవసరం కాగా, దక్షిణాఫ్రికా ఈజీగా సాధించింది. భారత్ పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Watch IPL 2022 Live Matches : భారత్ సహా ప్రపంచంలో ఎక్కడైనా ఐపీఎల్ లైవ్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో ఇలా చూడొచ్చు..!

ఈ మ్యాచ్ లో తొలుత భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా కూడా సరిగ్గా అన్నే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చివరి బంతికి 3 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా గెలిచింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో ఓపెనర్ లవురా వోల్వార్ట్ (80), లారా గూడాల్ (49), మిగ్నాన్ డుప్రీజ్ 52 (నాటౌట్), మరియానే కాప్ 32 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, హర్మన్ ప్రీత్ కౌర్ తలో రెండు వికెట్లు తీశారు.

కాగా, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు దుమ్మురేపారు. దక్షిణాఫ్రికాపై చెలరేగిపోయారు. తొలుత స్మృతి మంధాన, షెఫాలీ వర్మ విధ్వంసం సృష్టించగా, ఆ తర్వాత కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగుల భారీ స్కోర్ చేసింది భారత్.

Womens World Cup 2022 India fail to qualify for semis

మంధాన 84 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 71 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ 46 బంతుల్లో 8 ఫోర్లతో 53, మిథాలీ రాజ్ 84 బంతుల్లో 8 ఫోర్లతో 68, హర్మన్‌ప్రీత్ కౌర్ 57 బంతుల్లో 4 ఫోర్లతో 48 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, మసబాట క్లాస్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, అయబొంగ ఖాక, చోలే ట్రయాన్ తలో వికెట్ తీశారు.

IPL2022 KKR Beats CSK : ఐపీఎల్‌లో కోల్‌కతా బోణీ.. చెన్నైపై గెలుపు

కాగా, భారత్ పై విజయంతో దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ఫలితం అటు వెస్టిండీస్ అమ్మాయిలకు కూడా కలిసొచ్చింది. ఆ జట్టు కూడా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇప్పటికే సెమీస్ చేరాయి. సెమీస్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో వెస్టిండీస్, ఇంగ్లండ్ తో సౌతాఫ్రికా తలపడనున్నాయి. మార్చి 30, 31 తేదీల్లో సెమీస్ మ్యాచులు జరగుతాయి. ఏప్రిల్ 3న ఫైనల్ జరుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు