Womens World Cup 2025 Harmanpreet Kaur Comments after india lost match to england
Harmanpreet Kaur : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ మరో ఓటమిని చవిచూసింది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఛేదనలో స్మృతి వికెట్ కోల్పోవడమే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో హీథర్ నైట్ (109) శతకం బాదగా.. అమీ జోన్స్ (56), నాట్ సీవర్ (38) లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో దీప్తిశర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. శ్రీచరణి రెండు వికెట్లు తీసింది.
ఆ తరువాత 289 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 284 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (94 బంతుల్లో 88 పరుగులు), హర్మన్‌ప్రీత్ కౌర్ (70 బంతుల్లో 70 పరుగులు), దీప్తి శర్మ (57 బంతుల్లో 50 పరుగులు) రాణించారు. ఇంగ్లీష్ బౌలర్లలో నాట్ సీవర్ రెండు వికెట్లు తీసింది.
మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంపై టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) స్పందించింది. ఛేదనలో స్మృతి మంధాన ఔట్ కావడమే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పుకొచ్చింది. పరిస్థితులు ఎలా మారిపోయాయో తనకు అర్థం కావడం లేదంది. ఈ మ్యాచ్‌లో గెలుపు క్రెడిట్ ఖచ్చితంగా ఇంగ్లాండ్‌కే దక్కుతుందన్నారు. ఇంగ్లీష్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారని, వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ లక్ష్యాన్ని చేరకుండా అడ్డుకున్నారంది.
ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ స్థానంలో పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ తీసుకోవడంపైనా మాట్లాడింది. ‘స్మృతి, నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరిస్థితులు మా కంట్రోల్‌లోనే ఉన్నాయి. అయితే.. స్మృతి వికెట్ టర్నింగ్ పాయింట్. అయినప్పటికి రిచా, అమన్ జ్యోత్, దీప్తిలు గతంలోనూ మ్యాచ్‌లను గెలిపించారు. దురదృష్టవశాత్తు ఈ రోజు వారు అలా చేయలేకపోయారు. తుది జట్టులో ఇప్పటికే చాలా మంది బ్యాటర్లు ఉన్నారని నాకు తెలుసు.’ అని హర్మన్ అంది.
Shubman Gill : అందుకనే తొలి వన్డేలో ఓడిపోయాం.. లేదంటేనా.. గిల్ కామెంట్స్..
మ్యాచ్‌లో చివరి వరకు వచ్చి ఓడిపోవడంపై మాట్లాడుతూ తాను ఎంతో నిరాశచెందానని, తన గుండె పగిలిపోయిందని చెప్పింది. ఈ మ్యాచ్‌లో చివరి ఐదు నుంచి ఆరు ఓవర్లు మాత్రమే తమ ప్రణాళిక ప్రకారం జరగలేదంది. తాము మంచి క్రికెట్ ఆడుతున్నామని చెప్పుకొచ్చింది. మధ్యలోనే వదిలివేయడం లేదని, ఆఖరి వరకు పోరాడుతున్నామని తెలిపింది. అయితే.. చివరి లైన్‌ను క్రాస్ చేయలేకపోతున్నామంది. చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ ఇలా జరగడం బాలేదంది.
ఇక ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కూడా తాము మంచి క్రికెట్ ఆడినట్లు చెప్పుకొచ్చింది. తాము అంత సులభంగా ఓడిపోలేమని తెలిపింది. ఇక ఇప్పుడు టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లు ఎంతో ముఖ్యం. వాటిల్లో విజయం సాధించేందుకు మా శాయశక్తుల కృషి చేస్తాం. ఏం జరుగుతుందో చూద్దాం అని హర్మన్ అంది.