మరో సమరానికి సిద్ధమైన భారత బ్యాడ్మింటన్

మరో సమరానికి సిద్ధమైన భారత బ్యాడ్మింటన్

Updated On : September 17, 2019 / 2:33 AM IST

మరో సమరానికి భారత బ్యాడ్మింటన్‌ సిద్ధమైంది. వరల్డ్ ఛాంపియన్ షిప్ ముగిసిన కొద్ది రోజుల్లోనే మొదలవనున్న చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌కు మహిళల ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, మాజీ రన్నరప్‌ సైనా నెహ్వాల్.. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, కశ్యప్‌ సన్నద్దమయ్యారు. 2016లో ఇదే టోర్నీలో విజేతగా నిలిచిన సింధు.. పునరావృతం చేయాలని భావిస్తోంది.

సింధూకు తొలి రౌండ్‌ విజయం సాధిస్తే క్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ చెన్‌ యుఫె (చైనా), సెమీస్‌లో రెండో సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) లేదా సైనాలను ఢీకొంటుంది. గాయం నుంచి కోలుకున్న రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్‌ ఈ టోర్నీలో ఆడనుంది. టాప్‌ సీడ్‌ అకానె యామగుచి (జపాన్‌), మాజీ విశ్వవిజేత రచనోక్‌ (థాయ్‌లాండ్‌)లు సైతం పోటీలో ఉండటంతో టోర్నీ ఆసక్తిగా మారనుంది. 

ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్‌గా పీవీ సింధు, ఎనిమిదో సీడ్‌గా సైనా నెహ్వాల్‌ బరిలోకి దిగనున్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో 2012 లండన్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత లీ జురుయ్‌తో సింధు… ప్రపంచ 19వ ర్యాంకర్‌ బుసానన్‌ ఒంగ్‌బామ్‌రుంగ్‌ఫన్‌ (థాయ్‌లాండ్‌)తో సైనా ఆడతారు. లీ జురుయ్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 3–3తో సమంగా ఉండగా… సైనా 3–1తో బుసానన్‌పై ఆధిక్యంలో ఉంది. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన లీ జురుయ్‌ మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటుంది. 

పురుషుల సింగిల్స్‌లో భారత్‌ నుంచి నలుగురు ఎంట్రీలు పంపించినా… మోకాలి గాయం కారణంగా కిదాంబి శ్రీకాంత్‌… డెంగీ జ్వరంతో ప్రణయ్‌ టోర్నీ నుంచి వైదొలిగారు. భారత్‌ ఆశలన్నీ సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్‌పై ఆధారపడ్డాయి. పురుషుల సింగిల్స్‌లో 36 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్‌ షిప్ షిప్‌లో కాంస్య పతకం దక్కించుకున్న సాయిప్రణీత్‌ ఈ టోర్నీలో రాణిస్తాడనే ఆశాభావం వ్యక్తమవుతోంది. తొలి రౌండ్‌లో సుపన్యు అవింగ్‌సనోన్‌ (థాయ్‌లాండ్‌)తో సాయిప్రణీత్‌ ఆడనున్నాడు. తొలి రౌండ్‌లో గెలిస్తే రెండో రౌండ్‌లో మూడో సీడ్‌ షి యు కి (చైనా)తో సాయిప్రణీత్‌ ఆడే అవకాశం ఉంది. 

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి, సుమీత్‌ రెడ్డి–మను అత్రిలు పోటీ పడతారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా, అశ్విని పొన్నప్ప–సాత్విక్‌ సాయిరాజ్‌ జంటలు బరిలో ఉన్నాయి.